Share News

పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి

ABN , Publish Date - Jun 28 , 2026 | 06:43 PM

జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి
Jharkhand Cerebral Malaria

ఇంటర్‌నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా వైద్యాధికారులు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మలేరియా పెచ్చు మీరి విలయతాండవం చేస్తోంది. పోత్క, దౌద్రోదియా, కందర్ గ్రామాల్లోని 20 మందికి పైగా మలేరియా బారినపడ్డారు.


వీరిలో ఎక్కువ మంది చిన్నారులు కావటం గమనార్హం. మలేరియా మెదడుకు వ్యాపించటం(సెరిబ్రల్ మలేరియా)తో పీఎం శ్రీ కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న లక్కీ సర్దార్, దౌద్రోదియా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల రాహుల్ సర్దార్, కందర్ గ్రామానికి చెందిన సుబోలా సర్దార్ ప్రాణాలు కోల్పోయారు. సుబోలా సర్దార్ సోదరి ఏడాది వయసున్న ఖుష్బు సర్దార్‌కు కూడా మలేరియా మెదడుకు వ్యాపించింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.


మలేరియా ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో కొత్తగా 14 కేసులు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఎక్కువ మంది స్కూలు పిల్లలే ఉన్నారు. వైద్య బృందాలు ఇప్పటి వరకు 600 మందికి వైద్య పరీక్షలు చేశారు. మలేరియా సోకిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, లక్కీ సర్దార్ అనే బాలుడికి వైద్యం చేయటంలో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో అధికారులు పోత్కలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌ను సీజ్ చేశారు. క్లినిక్ ఆపరేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

ట్రంప్ ప్రైవేట్ స్పేస్‌‌లో రహస్య చీటీలు.. నటాలీ హార్ప్‌పై సంచలన ఆరోపణలు!

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

Updated Date - Jun 28 , 2026 | 07:10 PM