Share News

రూ.28,840 కోట్లతో ఉడాన్‌ 2.0

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:28 AM

వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు రూ28,840 కోట్ల నిధులతో 100 విమానాశ్రయాలను, 200 హెలిపోర్టులను నిర్మించాలని....

రూ.28,840 కోట్లతో ఉడాన్‌ 2.0

  • దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిపోర్టుల నిర్మాణం, అభివృద్ధి

  • 400 కోట్లతో స్వదేశీ విమానాలు, హెలికాప్టర్లు

  • 441 ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి రూ.2,577 కోట్లు

  • వచ్చే పదేళ్లపాటు పథకం అమలు

  • మరింత సమర్థంగా ఇమిగ్రేషన్‌, ట్రాకింగ్‌ సేవలు

  • ఐదేళ్లపాటు ఐవీఎఫ్‌ఆర్‌టీ పొడిగింపు

  • కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు రూ28,840 కోట్ల నిధులతో 100 విమానాశ్రయాలను, 200 హెలిపోర్టులను నిర్మించాలని, అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) 2.0 కింద 2026-27 నుంచి 2035-36 వరకు ఈ ప్రణాళికను అమలు చేయనుంది. దీంట్లో భాగంగా కొత్త ఎయిర్‌పోర్టుల, హెలిప్యాడ్‌ల నిర్వహణ, స్వదేశీ విమానాల కొనుగోళ్లను కూడా చేపట్టనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. వినియోగంలో లేని ఎయిర్ స్ట్రిప్స్ నుంచి 100 విమానాశ్రయాలను ఉడాన్‌ 2.0 పథకం కింద అభివృద్ధి చేస్తామన్నారు. 8 ఏళ్లలో రూ.12,159 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడతామని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటామని చెప్పారు. విమానాశ్రయాల నిర్వహణ, మరమ్మత్తుల కోసం మూడేళ్ల పాటు కేంద్రం ఆర్థికసాయం చేస్తుందని, ఒక్కో విమానాశ్రయానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.3.06 కోట్లు అందిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి వచ్చే 8 ఏళ్లలో కొత్తగా 200 హెలిపోర్టులను నిర్మిస్తామని తెలిపారు. దీని కోసం రూ.3,661 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో హెలిపోర్ట్‌కు ఏడాదికి రూ.90 లక్షలను అందించనున్నట్లు వెల్లడించారు.


మరోవైపు, 441 ఏరోడ్రోమ్‌ల కోసం రూ.2,577 కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. మారుమూల, ప్రతికూల ప్రాంతాల్లో తగినన్ని చిన్న విమానాలు, హెలికాప్టర్ల లేవని, ఈ నేపథ్యంలో కొరతను పరిష్కరించడానికి స్వదేశీ హెలికాప్టర్లు, విమానాలను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పవన్‌ హన్స్‌ కోసం రెండు హెచ్‌ఏఎల్‌ ధ్రువ్‌ హెలికాప్టర్లను, అలయన్స్‌ ఎయిర్‌కు రెండు హెచ్‌ఏఎల్‌ డోర్నియర్‌ విమానాలను సమకూరుస్తామన్నారు. దీనికోసం రూ.400 కోట్లను కేటాయించారు. ప్రాంతీయ మార్గాల్లో విమానయానాన్ని వచ్చే 10 ఏళ్లలో ప్రోత్సహించేందుకు, నిధుల పెట్టుబడికి, వ్యయానికి మధ్య వయబులిటీ గ్యాప్‌ను కుదించేందుకు రూ.10,043 కోట్లను కేటాయించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కాగా, 2016 అక్టోబరులో ప్రారంభమైన ఉడాన్‌ పథకం ఈ ఏడాది చివరికి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉడాన్‌ 2.0ని ప్రకటించింది. క్యాబినెట్‌ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. గత 10 ఏళ్లలో ఉడాన్‌ ద్వారా 663 కొత్త రూట్లు, 95 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని, సుమారు 1.62 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపారు. తాజా నిర్ణయంతో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులు రానున్నాయని, 4 కోట్ల మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్‌ పథకం పొడిగింపు

‘ఇమిగ్రేషన్‌, వీసా, విదేశీయుల నమోదు, ట్రాకింగ్‌’ (ఐవీఎఫ్‌ఆర్‌టీ) పథకాన్ని రూ.1800 కోట్ల వ్యయంతో ఐదేళ్లపాటు కేంద్రం పొడిగించింది. ఇమిగ్రేషన్‌ వ్యవస్థను, వీసా సర్వీసులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐవీఎ్‌ఫఆర్‌టీ కింద పర్యాటకంతోపాటు మెడికల్‌ టూరిజానికి, వాణిజ్య సంబంధిత రాకపోకలకు మరింత ప్రోత్సాహం కల్పించటం, అక్రమ వలసలను అడ్డుకోవటం లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నారు. ఇది ఒక సాంకేతిక ముందడుగు మాత్రమే కాదని, వ్యూహాత్మక పరిణామమని కేంద్రం ఒక ప్రకటనలో అభివర్ణించింది. 2010లో ప్రారంభమైన ఐవీఎ్‌ఫఆర్‌టీ 2014 వరకూ కొనసాగింది. అప్పటి నుంచి కేంద్రం పలుమార్లు ఈ పథకాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుండటంతో తాజాగా 2031 వరకూ పొడిగించారు. ‘ఇమిగ్రేషన్‌, విదేశీయుల చట్టం, 2025’ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 04:28 AM