Share News

250కి పైగా విమానాల రద్దు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:54 AM

పశ్చిమాసియాలో యుద్ధంతో నాలుగో రోజు మంగళవారం కూడా 250కు పైగా అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రానుపోను సర్వీసులు...

250కి పైగా విమానాల రద్దు

  • ఒక్క శంషాబాద్‌ నుంచే 47

  • సౌదీ, యూఏఈకి 8 సర్వీసులు నడిపిన ఇండిగో, స్పైస్‌జెట్‌

న్యూఢిల్లీ, ముంబై, శంషాబాద్‌ రూరల్‌, మార్చి 3: (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధంతో నాలుగో రోజు మంగళవారం కూడా 250కు పైగా అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రానుపోను సర్వీసులు కలిపి ఢిల్లీ నుంచి 80, ముంబై నుంచి 107, బెంగళూరు నుంచి 42, చెన్నై నుంచి 30, శంషాబాద్‌ నుంచి 47 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. నాలుగు రోజులుగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ముంబై, ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా, యూఏఈకు 8 వరకు విమానాలను నడిపాయి. జెడ్డాకు నాలుగు సర్వీసులు నడిపామని ఇండిగో తెలిపింది. మస్కట్‌కు (ఒమన్‌) ఒక విమానం నడుపుతున్నామని పేర్కొంది. మదీనా(సౌదీ అరేబియా), ఏథెన్స్‌ (గ్రీస్‌)కు కూడా విమానాలను నడిపే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపింది. ఫుజైరా (యూఏఈ)లో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొచ్చేందుకు మంగళవారం 4ప్రత్యేక విమానాలను నడుపుతున్నామని స్పైస్‌జెట్‌ ప్రకటించింది.

Updated Date - Mar 04 , 2026 | 03:54 AM