బెంగాల్ మొదటి దశ ఎన్నికల అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:14 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ నెల 23న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.
ఏడీఆర్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో వెల్లడి
కోల్‌కతా, ఏప్రిల్ 16: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ నెల 23న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో గురువారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), వెస్ట్ బెంగాల్ వాచ్ ఒక నివేదికను విడుదల చేశాయి. ప్రధాన పార్టీల్లో క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల్లో అధిక వాటా బీజేపీకే ఉంది. ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 152 మందిలో 106 మంది (70 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్టు వారి అఫిడవిట్‌లో ప్రకటించారు. అధికార తృణమూల్ పార్టీ 148 మందిని బరిలో దింపగా.. వీరిలో 63 మంది (43 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. 98 మంది సీపీఐ(ఎం) అభ్యర్థుల్లో 43 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 151 మంది అభ్యర్థుల్లో 39 మంది తమ నేర చరిత్రను ప్రకటించారు. మచ్చలేని ప్రజా జీవితానికన్నా గెలుపు అవకాశాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో 1,478 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1,475 మంది అఫిడవిట్లను విశ్లేషించగా.. 345 మంది క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రకటించారు. 294 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలున్నాయని వెల్లడించారు. 19 మంది అభ్యర్థులు హత్యకు సంబంధించిన కేసులున్నాయని ప్రకటించారు. సంపద విషయానికి వస్తే.. 309 మంది అభ్యర్థులు (21 శాతం) కోటీశ్వరులుగా ఉన్నారు. మొదటి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.1.34 కోట్లుగా ఉన్నాయి.