‘గోమూత్ర నిపుణుడు’ అంటూ వ్యాఖ్య.. ప్రియాంక గాంధీకి విద్యావేత్తల ఘాటు లేఖ
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:22 PM
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ విచారకరమంటూ 215 మంది విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం ప్రియాంక గాంధీ ఈ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పరీక్ష సంస్కరణల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటిని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై పలువురు విద్యావేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ వాటి ప్రభావం ఒక్క వ్యక్తికే పరిమితం కాదని అన్నారు. నిపుణులతో విభేదాలు వారి సిద్ధాంతాలకే పరిమితమై ఉండాలని అన్నారు. ఇందుకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చిత్రీకరణల భయం లేకుండా శాస్త్రవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు ప్రజాసంబంధిత అంశాలపై చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండాలని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ కామకోటి ఇప్పటివరకూ 150కిపైగా పరిశోధన పత్రాలను ప్రచురించారని, 50కిపై పరిశోధన ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారని గుర్తు చేశారు. డీఆర్‌డీఓ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గోమూత్ర వ్యాఖ్యలు విస్తృత విద్యా, పరిశోధన రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం