అయిదు రాష్ట్రాల సందర్శనకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:08 AM
వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ఆయా రాష్ట్రాలకు..
న్యూఢిల్లీ, అక్టోబరు 4: వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీ కాలం మే నెలలో ముగియనుంది. మరోవైపు పదవీ కాలం పూర్తికావడానికి ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు జరిపే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఉంది. ఎన్నికల తేదీ ఎప్పుడు వెలువడినప్పటికీ సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో తొలుత డిప్యూటీ కమిషనర్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఈ వారంలోనే గోవా, వచ్చే వారం ఉత్తరాఖండ్, ఆ తరువాత పంజాబ్, మణిపూర్ వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.