ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్ ఎంపీల మద్దతు!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:05 AM
పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
స్పీకర్‌కు లేఖ ఇచ్చామన్న తిరుగుబాటు నేత కాకోలి ఘోష్
కోల్‌కతా, న్యూఢిల్లీ, జూన్ 8: పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న దీదీకి.. లోక్‌సభ ఎంపీల నుంచి కూడా అటువంటి సవాలే ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు కేంద్రంలోని అధికారపక్షమైన ఎన్‌డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఉన్న కాకోలీ ఘోష్ దస్తిదార్ ఈ ఎంపీలకు సారథ్యం వహిస్తున్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేశామని, ఈ మేరకు లేఖ కూడా ఇచ్చామని చెప్పారు. కాగా, ఇప్పటికే కాకోలి ఘోష్ దస్తిదార్‌ను పార్టీ విప్ పదవి నుంచి మమత తొలగించి, ఆ స్థానంలో ఎంపీ కల్యాణ్ బెనర్జీని నియమించారు. ఈ తొలగింపుపై లోక్‌సభ సెక్రటేరియట్‌కు తృణమూల్ అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ఒక రెబెల్ ఎంపీ వెల్లడించారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా తానే కొనసాగుతానని కాకోలి తెలిపారు. బెంగాల్‌లో వచ్చిన ప్రజాతీర్పు ఆధారంగానే కేంద్రంలో ఎన్‌డీఏకు మద్దతివ్వాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తిరుగుబాటు ఎంపీలు తక్షణం తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరాలని భావించటం లేదని, ఎన్‌డీఏకు మద్దతిస్తూ లోక్‌సభలో వేరు శిబిరంగా కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుకేందు శంకర్ రాయ్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమత గత ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని, పార్టీ యంత్రాంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, దీని ఫలితంగానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఒక ప్రకటనలో సుకేందు వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి ఘటనలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన పోలీసు అధికారులపై అంతర్గత విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేశానని, దాంతో తనను పార్టీలో పక్కనపెట్టారని తెలిపారు. అప్పట్లోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సోమవారం ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశంలో పాల్గొనటానికి మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఢిల్లీకి వచ్చిన రోజే.. ఎంపీల తిరుగుబాటు చోటు చేసుకోవడం గమనార్హం.
టీఎంసీ ‘పుష్ప’ జహంగీర్ అరెస్టు
తృణమూల్ కాంగ్రెస్ నేత, తనకు తాను ‘పుష్ప’ అని చెప్పుకొన్న జహంగీర్ ఖాన్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సోమవారం అరెస్టు చేసింది. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ఫాల్టానియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలు, ఈవీఎంలపైన బీజేపీ గుర్తు కనబడకుండా టేపులు అతికించడం, దోపిడీ తదితర కేసుల్లో జహంగీర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కొంతకాలంగా పరారీలో ఉన్న జహంగీర్ దేశం దాటి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని నేపాల్ సరిహద్దులకు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. టీఎంసీ నేత అరెస్టు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు ఫాల్టాలోని అతడి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.