20 లక్షల ఈ-మెయిల్ ఖాతాలు సృష్టించి.. పాక్, బంగ్లాదేశ్‌లకు విక్రయం
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:55 AM
ఢిల్లీ పాఠశాలలకు, బాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యక్రమాలకు ఇటీవల వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి..
ఆ ఈ-మెయిళ్ల నుంచే బడులకు బాంబు బెదిరింపులు
యూపీలోని కాన్పూర్‌లో 24 ఏళ్ల యువకుడి అరెస్టు
కాన్పూర్, నవంబరు 14: ఢిల్లీ పాఠశాలలకు, బాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యక్రమాలకు ఇటీవల వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి.. అందులోనూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు వంటి దేశాల నుంచి ఈ బెదిరింపుల ఈ-మెయిల్స్ అందుతున్నాయి. ఆ ఈ-మెయిల్స్‌ను సృష్టించినది భారత్‌లో అయితే.. సందేశాలు వస్తున్నది విదేశాల నుంచి కావడంతో.. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్) ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కాన్పూర్‌కు చెందిన అంకిత్ శంఖ్వార్ అనే యువకుడు ఏకంగా 20 లక్షలకుపైగా జీమెయిల్ ఖాతాలు సృష్టించి.. వాటిని పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీ, ఈజిప్టు తదితర దేశాల్లోని వ్యక్తులకు విక్రయించి, క్రిప్టో కరెన్సీ రూపంలో సొమ్ము తీసుకున్నాడని గుర్తించింది. ఇలా ఈ-మెయిల్ ఐడీలు విక్రయించి, బంగ్లాదేశ్‌కు చెందిన అలామిన్ ఇస్లాం అనే వ్యక్తి నుంచి 6000 యూఎస్‌డీటీ (సుమారు రూ.5.6 లక్షలు) క్రిప్టో కరెన్సీ రూపంలో సొమ్ము తీసుకున్నట్టు అంకిత్ ఫోన్‌లో ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు. అంకిత్ కంప్యూటర్‌లో గుర్తించిన 20 లక్షల జీమెయిల్ ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్టు తెలిపారు.