1805 కోట్ల ఉపాధి నిధులు విడుదల
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:09 AM
రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీనరేగా) కింద ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రామికుల వేతనాలకు మార్గం సుగమం
న్యూఢిల్లీ, అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీనరేగా) కింద ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.1805.24 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల్లో 2025 -26లోని పెండింగ్ వేతన బకాయిలూ కలిసి ఉన్నాయి. మొత్తం రూ.1805.24 కోట్లను కేంద్రం మూడు కేటగిరీలుగా విభజించింది. ఎస్సీలకు రూ.361.23 కోటు, ఎస్టీలకు రూ.253.04 కోట్లు, ఇతరులకు రూ.1190.96 కోట్లుగా పేర్కొంది. ఈ నిధుల వినియోగంపై కీలక నిబంధనలను విధించింది. కూలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రెట్టింపు చెల్లింపులు చేయరాదని ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన 12 నెలల్లోపు వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని, ఒకవేళ ఆ నిధు లపై ఏవైనా వడ్డీ వస్తే దానిని తిరిగి కేంద్రానికే చెల్లించాలని స్పష్టం చేసింది. కేం ద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కూలీలకు ఊరట లభించనుంది. కాగా, ఏపీకి ఉపాధి హామీ నిధుల విడుదలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలితాలను ప్రతి అర్హుడికీ చేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
దేశంలో ఉపాధి పనుల్లో మనమే ముందంజ!
రాష్ట్రంలో ఉపాధి శ్రామికులకు రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. ఈ నిధుల విడుదలతో వారి వేతనాల చెల్లింపునకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పదే పదే ఢిల్లీకి వెళ్లి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఈ నిధులను మంజూరుచేసింది. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పటి నుంచీ మిగతా రాష్ట్రాల్లో అంత మేర పనులు జరగకపోయినా, మన రాష్ట్రంలో పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. దీంతో పాటు మెటీరియల్ నిధులు కూడా కేంద్రం నుంచి అందాల్సి ఉంది. అవి కూడా వెంటనే మంజూరుచేయాలని ఇప్పటికే కేంద్రానికి అధికారులు లేఖలు రాశారు.