మొహర్రం ఊరేగింపులో 15వేల మందిని చంపాలనుకున్నా
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:18 AM
మొహర్రం ఊరేగింపును విషాదంగా మార్చేందుకు ఓ వ్యక్తి చేసిన యత్నం ముగ్గురు మహిళా వాలంటీర్లు, పోలీసుల అప్రమత్తతతో తప్పినప్పటికీ..
నిందితుడి అంగీకారం.. ఎలుకల మందు మాత్రల పంపిణీ
ముగ్గురు మహిళల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
ముంబై, జూన్ 28: మొహర్రం ఊరేగింపును విషాదంగా మార్చేందుకు ఓ వ్యక్తి చేసిన యత్నం ముగ్గురు మహిళా వాలంటీర్లు, పోలీసుల అప్రమత్తతతో తప్పినప్పటికీ, దాని వెనుక ఉన్న కుట్ర భయం కలిగించేదిగా ఉంది. ఊరేగింపులో పాల్గొన్నవారికి విషపు మాత్రలు ఇచ్చి కనీసం 15వేల మందిని చంపాలని అనుకున్నట్టు నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీ పోలీసుల వద్ద అంగీకరించడం కుట్ర తీవ్రతను బహిర్గత పరుస్తోంది. ముంబైలో శుక్రవారం జరిగిన మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నవారికి అతడు రోగనిరోధక శక్తి పెంచే మాత్రల పేరుతో ఎలుకల మందు నింపిన క్యాప్స్యూల్స్‌ను పంపిణీ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొహరం నాడు జరిపే అషురా ఊరేగింపు రీయే రోడ్‌లోని రహమతాబాద్ శ్మశానవాటిక వద్దకు చేరుకోగానే రద్దీ అధికమయింది. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రేమ్‌జీ ఎలుక మందు నింపిన క్యాప్స్యూల్స్‌ను పంచిపెట్టాడు. మరికొందరి చేత పంపిణీ చేయించాడు. అతడు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ముగ్గురు మహిళా వాలంటీర్లు నిలదీసి అడిగారు. ఆ మాత్రలను మింగొద్దంటూ లౌడ్ స్పీకర్ ద్వారా చెప్పించారు. మరోసారి గట్టిగా అడిగేసరికి అవి రోగనిరోధక శక్తిని పెంచే మాత్రలని నిందితుడు సమాఽధానం ఇచ్చాడు. అయినా నమ్మకం కుదరక ఆ క్యాప్స్యూల్స్‌ను ముక్కలు చేసి చూడగా వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దాంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఆ క్యాప్స్యూల్‌ను తీసుకున్న సల్మాన్ సయీద్ అనే వ్యక్తికి వాంతులు కావడంతో పాటు కడుపునొప్పితో బాధపడ్డాడు. అతనితోపాటు మొత్తం 11 మంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా కోలుకున్నారు. స్పందించిన బైకుల్లా ఏరియా పోలీసులు ప్రేమ్‌జీని ఆ శ్మశానం వద్దే అదుపులోకి తీసుకొని అతడి వద్ద ఉన్న 14,900 క్యాప్స్యూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కనీసం 15వేల మందిని చంపాలని అనుకున్నట్టు అతడు పోలీసులకు చెప్పాడు. నిందితుడు ప్రేమ్‌జీ పుణెలోని విమాన్‌నగర్ నివాసి. బీబీఏ చదివిన అతడు అక్కడే పెయింటింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదం కుట్ర ఉందన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.