Maoists: 14 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:31 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ అడవుల్లో శనివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో రెండుచోట్ల ఎదురుకాల్పులు
చర్ల/చింతూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ అడవుల్లో శనివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. సుక్మా జిల్లా కుంట డివిజన్ కిష్టారం అడవుల్లో కుంట ఏరియా కమిటీ కమాండర్ మంగడుతో పాటు అతడి టీం సభ్యులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో సుక్మాకు చెందిన డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టి.. మావోయిస్టులు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. అనంతరం ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని సుక్మా ఎస్పీ కిరణ్‌చవాన్ తెలిపారు. మృతుల్లో మంగడు, కమిటీ సభ్యుడు సచిన్ మగ్ఘూన్ ఉన్నట్టు గుర్తించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో మావోయిస్టులు వాడిన ఏకే47, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లతో పాటు పెద్దఎత్తున పేలుడు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆరు నెలల క్రితం కుంట డీఎస్పీ ఆకా్‌షరావును ఐఈడీ పెట్టి హతమార్చిన ఘటనలో ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని ఆ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. మృతులను పామేడు ఏరియా కమిటీ సభ్యులు మూచకి అయితి, మడకం హంగాగా బలగాలు గుర్తించాయి.
కుంట కమిటీ ఖాళీ!
సుక్మా జిల్లాలో కుంట ఏరియా కమిటీ ప్రధానమైంది. ఈ కమిటీ సుక్మా అడవుల్లో అనేక ఘటనలకు పాల్పడింది. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో కమిటీకి చెందిన మావోయిస్టులు మృతిచెందారు. ప్రస్తుతం కమిటీ కమాండర్ మంగడు కార్యకలాపాలు సాగిస్తున్నాడు. వీరి కదలికలపై నిఘాపెట్టిన డీఆర్‌జీ బలగాలు శుక్రవారం దాడిచేసి ఎన్‌కౌంటర్ చేశాయి. ఈ ఘటనతో కుంట కమిటీ పూర్తిగా ఖాళీ అయ్యింది.