భారత్‌లో చిచ్చుకు విదేశీ నిధులు!
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:48 AM
దేశంలో చిచ్చు పెట్టేందుకు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ నిధులు వచ్చాయా? అంటే.. ఔననే అంటున్నారు ఈడీ అధికారులు.
జర్మనీ-కెనడా-బ్రిటన్ మీదుగా 15 లక్షల డాలర్లు
న్యూఢిల్లీ, నవంబరు 7: దేశంలో చిచ్చు పెట్టేందుకు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ నిధులు వచ్చాయా? అంటే.. ఔననే అంటున్నారు ఈడీ అధికారులు. సుమారు 15లక్షల డాలర్ల(రూ.14కోట్లు) మేరకు భారత్‌కు చేరుకున్నట్టు చెబుతున్నారు. ఈ నిధులు జర్మనీ, కెనడా వయా బ్రిటన్‌ల మీదుగా భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు. భారత అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేలా.. మిలియన్ డాలర్ల నగదును స్వీకరించిన బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థపై అధికారులు దృష్టి సారించారు. ఈ అనుమానాస్పద నగదు బదిలీ వ్యవహారంపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిధులను ఏ ఉద్దేశంతో బదిలీ చేశారు? ఎలా వచ్చింది? వాటి మూలం ఎక్కడుంది? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ నగదును బదిలీ చేసిన వ్యక్తులు, భారత్‌లో అందుకున్న సంస్థలు, వ్యక్తులపైనా దృష్టి సారించారు. నగదును పంపించిన అసలు సంస్థ జర్మనీ కేంద్రంగా పనిచేసే డాక్టర్ మథియాస్ కర్ల్ వోఘ్ ట్రస్ట్ అని అధికార వర్గాలు తెలిపాయి. ఈడీ పరిశోధనలో ట్రస్టు నుంచి నిధులు లుథియానాకు చెందిన ఎక్స్‌బేస్ డిజిటల్(యూఏబీ)కి చేరినట్టు వెల్లడైంది.