Share News

హోర్ముజ్‌ జలసంధి గుండా.. భారత్‌కు 1.35 లక్షల టన్నులముడిచమురు నౌక

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:21 AM

కల్లోల హోర్ముజ్‌ జలసంధి మీదుగా 1,35,335 టన్నుల ముడిచమురుతో కూడిన నౌక ఒకటి ముంబై తీరానికి చేరింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యాక ఆ జలసంధి గుండా.....

హోర్ముజ్‌ జలసంధి గుండా.. భారత్‌కు 1.35 లక్షల టన్నులముడిచమురు నౌక

  • రేడార్లకు చిక్కకుండా డార్క్‌మోడ్‌లో ప్రయాణించి ముంబైకి!

  • 20 లక్షల బ్యారెళ్ల చమురుతో వస్తున్న మరో నౌక.. 1-2 రోజుల్లో తీరానికి!

  • హోర్ముజ్‌ గుండా భారత నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇచ్చిందంటూ వార్తలు.. ధ్రువీకరించని ఇరు దేశాలు

  • విదేశాంగ మంత్రుల చర్చలో నౌకాయాన భద్రత ప్రస్తావనకు వచ్చిందన్న రణధీర్‌ జైస్వాల్‌

  • ఇంతకు మించి మాట్లాడితే తొందరపాటే అవుతుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 12: కల్లోల హోర్ముజ్‌ జలసంధి మీదుగా 1,35,335 టన్నుల ముడిచమురుతో కూడిన నౌక ఒకటి ముంబై తీరానికి చేరింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యాక ఆ జలసంధి గుండా మనదేశానికి చేరుకున్న మొదటి నౌక ఇదే. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక కెప్టెన్‌ సుక్షాంత్‌ సింగ్‌ సంధు భారతీయుడు కాగా.. భారత్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌కు చెందిన 29 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌక పేరు షెన్‌లాంగ్‌ సూయెజ్‌ మ్యాక్స్‌. మార్చి 1న సౌదీలోని రాస్‌ తనూరా పోర్టులో చమురు లోడ్‌ చేసుకుని మార్చి 3న బయల్దేరిన ఈ నౌక.. మార్చి 8వ తేదీ దాకా ట్రాకింగ్‌ సిస్టమ్స్‌కు కనిపించింది. ఆ తర్వాత తాత్కాలికంగా ట్రాకింగ్‌ సిస్టమ్స్‌కు కనిపించకుండా పోయింది. ఆ దారిలో వస్తున్న నౌకలపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వారి రేడార్లకు చిక్కకుండా నౌకలోని ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఏఐఎస్)ను ఆపివేసి డార్క్‌మోడ్‌లో నడపడమే ఇందుకు కారణం. హోర్ముజ్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని దాటాక మళ్లీ మార్చి 9న ఏఐఎస్ను ఆన్‌ చేయడంతో మళ్లీ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌కు కనిపించడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అది ముంబై పోర్టుకు చేరుకుంది. సాయంత్రం 6.06 గంటలకు జవహర్‌ ద్వీప్‌ వద్ద లంగరు వేశారు. కాగా.. 1-2 రోజుల్లో మరో నౌక కూడా భారత తీరానికి చేరే అవకాశం ఉన్నట్టు నౌకల ట్రాకింగ్‌, చమురు పరిశ్రమ వర్గాల సమాచారం. అది భారత జాతీయ పతాకంతో వచ్చే వీఎల్‌సీసీ (వెరీ లార్జ్‌ క్రూడ్‌ క్యారియర్‌) అని.. షెన్‌లాంగ్‌ నౌక దాదాపు 10 లక్షల బ్యారెళ్ల చమురు తెస్తే, అది ఏకంగా 2 మిలియన్‌ బారెళ్ల ఇరాకీ చమురుతో వస్తోందని.. ఇప్పటికే భారత జలాల్లోకి వచ్చిందని, త్వరలో ఒడిశాలోని పారాదీప్‌ తీరానికి అది చేరనుందని తెలుస్తోంది.


ఇరాన్‌తో మాట్లాడాం..

హోర్ముజ్‌ జలసంధి గుండా అనుమతి లేకుండా వెళ్లే నౌకలను పేల్చేస్తామంటూ ఐఆర్‌జీసీ కొద్దిరోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. షెన్‌లాంగ్‌ సూయెజ్‌మ్యాక్స్‌ భారత్‌కు ఎలా చేరుకుందన్నదే ప్రశ్న. ఆ నౌక కోసం భారత్‌ ఇరాన్‌ అనుమతి తీసుకుందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. దాన్ని ఇరుదేశాల ప్రభుత్వ వర్గాలూ ధ్రువీకరించలేదు. అయితే, మన విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ మధ్య ఇటీవలి కాలంలో మూడుసార్లు చర్చలు జరిగాయని.. చివరిసారి జరిగిన హోర్ముజ్‌ జలసంధిలో నౌకల భద్రత, భారతదేశ ఇంధన భద్రత అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ గురువారం తెలిపారు. ఇంతకు మించి ఇప్పుడు తానేమీ చెప్పలేనని.. అలా చెబితే అది తొందరపాటు అవుతుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. హోర్ముజ్‌ మూసివేతతో మన దేశానికి చెందిన 28 నౌకలు అక్కడ చిక్కుకుపోయాయని షిప్పింగ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీ రాజేశ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 04:21 AM