Share News

13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక కుట్ర

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:07 AM

ఓటర్లను తొలగించడం ద్వారా గెలుపు ఓటములను ప్రభావితం చేసే కుట్రకు కేంద్రం పాల్పడుతోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.

13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక కుట్ర

  • ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే పన్నాగం

  • ఒకే దేశం, ఒకే ఎన్నిక వెనుక.. ఒకే పార్టీ లక్ష్యం

  • కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ఆరోపణలు

న్యూఢిల్లీ, అక్టోబరు 15: ఓటర్లను తొలగించడం ద్వారా గెలుపు ఓటములను ప్రభావితం చేసే కుట్రకు కేంద్రం పాల్పడుతోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. సర్‌ ద్వారా ఓటు హక్కును కాలరాస్తోందని, 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం ఎన్నికలను సెట్‌ చేయడం కాక (కుమ్మక్కు) మరేమిటని ప్రశ్నించారు. ‘‘2024 ఎన్నికల్లో విజయం, ఓటమికి మధ్య వ్యత్యాసం 2 శాతం ఓట్లే. మరి మీరు 13 కోట్ల మంది ఓట్లను తొలగించారు. ఇందులోని ఆంతర్యం ఏమిటి?’’ అని దీప్కే కేంద్రాన్ని నిలదీశారు. గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను ప్రభుత్వం అంతలా ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక.. ‘ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే నేత’ అన్న లక్ష్యం దాగుందని ఆరోపించారు.

కనాట్‌ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో సీజేపీ ఈనెల 16న తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌ (మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగురవేయండి) కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు దీప్కే పిలుపునిచ్చారు. కాగా, కనాట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్క్‌లో సీజేపీ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేవలం 11 మందిని మాత్రమే జాతీయ జెండాతో మార్చ్‌కు అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - Oct 16 , 2026 | 06:09 AM