సాక్ష్యం లేని ఆరోపణలు.. ప్రజాస్వామ్యంపై దాడే!
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:43 AM
ఎన్నికల వ్యవస్థ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయటం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు పేర్కొన్నారు
విపక్షాల నిరసనలపై 124 మంది మాజీ సివిల్ సర్వెంట్ల ఆగ్రహం
ఎస్‌ఐఆర్‌ను సమర్థిస్తూ దేశ ప్రజలకు బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 10: ఎన్నికల వ్యవస్థ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయటం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను వారు తోసిపుచ్చారు. ఈ మేరకు 124 మంది ఐఏఎస్, ఐఎ్‌ఫఎస్ అధికారులు దేశ ప్రజలకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్లమూ కాదు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఎన్నికల వ్యవస్థపై పదేపదే ఆరోపణల దాడి జరుగుతున్నందునే ఈ లేఖ రాస్తున్నాం. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా జరుగుతున్న ఈ విమర్శల దాడులు మనమంతా విశ్వసించే ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రిగ్గింగ్ ఎన్నికలు ఎలా ఉంటాయో మాకు తెలుసు. ఓటర్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు తరిమేసి బ్యాలెట్ బాక్సులను అపహరించిన కాలంలో మేము ఉద్యోగాలు చేశాము. ఇలాంటి దారుణాలను చాలామంది సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ, మేము విధి నిర్వహణలో చూశాము. పోలింగ్ బూత్‌ల ఆక్రమణను నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు 1989లో చట్టం చేసేవరకు బూత్‌ల ఆక్రమణ సర్వసాధారణంగా ఉండేది. హింస రాజ్యమేలుతుంటే.. ప్రజాస్వామ్యం మౌనంగా ఉండిపోయేది. సమర్థవంతమైనఎన్నికల నిర్వహణకు 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ.
ఆ ఎన్నికల సందర్భంగా ఒక్క బూత్‌లో కూడా రీపోలింగ్ అవసరం రాలేదు. ఏ ఒక్కరినీ గుడ్డిగా అనుసరించకుండా ఎన్నికల సంఘం తీసుకొచ్చిన క్రమబద్ధమైన మార్పుల వల్లే ఎన్నికల నిర్వహణ మెరుగుపడింది. ఇప్పుడు ఎన్నికల్లో రిగ్గింగ్ జరగాలంటే వేలమంది ప్రభుత్వ అధికారులు నోరుమూసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. పార్టీలు పోలింగ్ బూత్‌లో ఏజెంట్లను కూర్చోబెట్టలేని పరిస్థితి ఉండాలి. అలాంటి పనులు ఇప్పుడు సాధ్యం కాదు. ప్రశ్నించటం, ఆరోపణలు చేయటం ప్రతి పౌరుడి హక్కు.. కానీ, అందుకు ఆధారాలు కూడా చూపటం వారి విధి. మీరు గెలిచినంతకాలం వ్యవస్థ బాగున్నట్లు.. మీరు ఓడిపోగానే రిగ్గింగ్ జరిగినట్లా?’ అని వారు ప్రశ్నించారు. ఈ లేఖపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్, పలుదేశాల్లో రాయబారులుగా పనిచేసిన భస్వతి ముఖర్జీ, అశోక్ సజ్జన్‌హర్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, పంజాబ్, కేరళం రాష్ట్రాల మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అయ్యర్ కృష్ణారావు, శైలేంద్రకుమార్, అశోక్‌కుమార్ సిన్హా, సర్వేశ్ కౌషల్, పాలట్ మోహన్‌దా్‌స, రిటైర్డ్ ఐఏఎ్‌సలు ఆర్డీ కపూర్, సమిరేంద్ర చటర్జీ, గోపాలకృష్ణ, వివేక్ భరద్వాజ్, నవనీత్ సెహగల్ తదితరులు సంతకాలు చేశారు.