భారత్‌కు వచ్చేస్తాం.. సాయం చేయండి
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:09 AM
అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రభావంతో దాదాపు 12వేల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వీరంతా స్వదేశానికి తిరిగి రావడానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
గల్ఫ్‌లో చిక్కుకున్న 12వేల మంది భారతీయుల అభ్యర్థన
న్యూఢిల్లీ, మార్చి 6: అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రభావంతో దాదాపు 12వేల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వీరంతా స్వదేశానికి తిరిగి రావడానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ విషయమై ఆయా ప్రాంతాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ప్రధానంగా యూఏఈలో చిక్కుకున్న వారినుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో అక్కడి గగనతలాన్ని చాలావరకూ మూసివేశారు. ఇక దోహాలో చిక్కుకున్న 850 మంది భారత పౌరులు సౌదీ అరేబియా వరకూ రోడ్డు మార్గంలో ప్రయాణించి రియాద్ ఎయిర్‌పోర్టు నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, అబుదాబి, దోహా విమానాశ్రయాలు మూతపడగా యూఏఈలోని ఫుజైరా నుంచి కొన్ని విమాన సర్వీసులు నడుస్తున్నాయి. యూఏఈపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అక్కడ పెద్దసంఖ్యలో చిక్కుకున్న భారతీయులను తరలించడం సవాలుగా మారింది. వీరిలో చాలామంది రోడ్డు మార్గంలో ఒమన్‌లోకి ప్రవేశించి, మస్కట్ విమానాశ్రయం నుంచి భారత్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.