పశ్చిమాసియా దేశాల్లో 12,000 విమానాల రద్దు
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:11 AM
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది విమానాలు రద్దవగా.. విమానాల టికెట్ల ధరలు ఆకాశాన్నంటిన పరిస్థితి.
ఇతర మార్గాల్లో భగ్గుమన్న టికెట్ల ధరలు
లండన్ - ముంబై టికెట్ రూ.2.9 లక్షలు!
న్యూఢిల్లీ, మార్చి 3: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది విమానాలు రద్దవగా.. విమానాల టికెట్ల ధరలు ఆకాశాన్నంటిన పరిస్థితి. ఈ కారణంగా పాకిస్థాన్ తమ గగన తలాన్ని మార్చి 31 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు నోటమ్ జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికన్, ఇజ్రాయెల్ బేస్‌లపై ఇరాన్ దాడులు విమానయానమార్గాలను పరిమితం చేశాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్ వేలాదిగా తమ విమానాలను రద్దు చేయడమో.. మళ్లించడమో చేయాల్సి వచ్చింది. దీనికితోడు పాకిస్థాన్.. ఆఫ్ఘానిస్థాన్‌ల మధ్య సైనిక ఘర్షణల ప్రభావం కూడా విమానయాన రంగంపై పడింది. కేవలం పాక్ నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్లే విమానాలే 300కు పైగా రద్దయ్యాయి. కాగా ఇరాన్‌పై అమెరికా దాడులు మొదలయ్యాక పశ్చిమాసియా దేశాల్లో 12,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. కాగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే, వచ్చే విమానాలు కూడా ప్రతిరోజు 700కు పైగా రద్దవుతుండడంతో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. గల్ఫ్‌ని బైపాస్ చేసి లండన్ నుంచి ముంబయి వచ్చే యూరోపియన్ విమానయాన సంస్థల విమానాల్లో వన్ వే ఎకానమీ క్లాస్ టికెట్ ధర సోమవారం ఏకంగా రూ.2.9 లక్షలకు చేరుకుంది. సాధారణ సమయాల్లో ఈ మార్గంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.20,000-రూ.40,000 వరకు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుంచి లండన్, ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే విమానాల టికెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.