10 మంది సభ్యులతో విచారణ కమిటీ
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:57 AM
‘ఐఐటీ బాంబే’లో జరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారించేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు.
వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచన
సెలవుపై ప్రొఫెసర్ సూర్యనారాయణ
‘ఐఐటీ బాంబే’ విద్యార్థి ఆత్మహత్య కేసులో తాజాగా కీలక పరిణామాలు
ముంబై, సెప్టెంబరు 23: ‘ఐఐటీ బాంబే’లో జరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారించేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఐఐటీ పాలక్కాడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ రమేశ్ వెంకటేశ్వరన్ నేతృత్వం వహించనున్నారు. విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని కమిటీకి నిర్దేశించారు. మరోవైపు ఐఐటీ బాంబే పరిపాలనా వ్యవహారాల డీన్ పదవి నుంచి తొలగించిన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉండడంతో ఆయనను సెలవుపై వెళ్లాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కోరింది. సాహిల్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని, సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తాజాగా చర్యలు చేపట్టారు. తమ కుమారుడిని కులం పేరుతో వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని సాహిల్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. కాగా, ప్రొఫెసర్ సూర్యనారాయణపై వస్తున్న విమర్శలను ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి.రాంగోపాలరావు ఖండించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ తనకు ఎప్పటి నుంచో తెలుసునని, ఆయన చాలా పెద్దమనిషి, నిజాయితీపరుడని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణపై వచ్చిన విమర్శలు, వివాదంపై నిష్పాక్షిక విచారణ చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. విద్యార్థుల అవగాహనా శక్తి అందరిలోనూ ఒకేవిధంగా ఉండదన్న రాంగోపాలరావు.. దీనికి పరిష్కారంగా బీటెక్‌ను ఐదేళ్లకు పెంచాలని సూచించారు. బాగా చదువుతున్న వారికి నాలుగేళ్లకు, లేదా మూడున్నరేళ్లకు పరిమితం చేసి.. పుంజుకోలేని వారికి ఐదేళ్ల పాటు బీటెక్ అవకాశం కల్పించవచ్చని ఎక్స్‌లో పోస్టు చేశారు.