ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:14 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్‌లో డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ ఎదుట 108 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.
101 తుపాకులతో డీజీపీ గౌతమ్ ఎదుట సరెండర్
వారిపై రూ.3.95 కోట్ల రివార్డు
వారిచ్చిన సమాచారంతో భారీ డంప్ గుర్తింపు
అందులో 3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం
చర్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్‌లో డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ ఎదుట 108 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరంతా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిపై సుమారు 3.95 కోట్ల రివార్డు ఉండగా.. వీరిలో ఆరుగురు డివిజన్ కమిటీల కమాండర్లున్నారు. మార్చి 31నాటికి ఆపరేషన్ కగార్‌ను ముగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో బలగాలు కూబింగ్‌లు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారీగా నక్సల్స్ లొంగిపోయేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ చెందిన 108 మంది మావోయిస్టులు, ఏకే47, ఇన్‌స్సాస్, ఎస్‌ఎల్‌ఆర్.. మొత్తం 101 తుపాకులతో బుధవారం డీజీపీ ఎదుట సరెండరయ్యారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన డీజీపీ గౌతమ్.. వీరిపై రూ.3.95 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. వీరందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. ఇంకా అడవుల్లో ఉన్న నక్సల్స్ లొంగిపోవాలని కోరారు. ఇక ఈ 108 మందిలో 37 మంది బీజాపూర్, 30 మంది దంతెవాడ, 18 మంది సుక్మా, 16 మంది బస్తర్, నలుగురు నారాయణపూర్, ముగ్గురు కాంకేర్ జిల్లాకు చెందిన వారున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో కేంద్ర బలగాలు బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్‌ని గుర్తించాయి. అందులో రూ.3.61 కోట్ల నగదు, రూ.1.64 కోట్ల విలువ చేసే కిలో బంగారం, పలు తుపాకులు, బుల్లెట్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్‌లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకడం ఇదే మొదటిసారని డీజీపీ తెలిపారు. మరోవైపు.. ఒడిశా రాష్ట్రం కందమాల్ జిల్లాలో కూడా పోలీసుల ఎదుట 10 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఒడిశా రాష్ట్ర కమిటీ పొట్టం సోనూ, డీవీపీఎం సాలం అనుప ఉన్నారు. వీరందరిపై రూ.1.15 కోట్ల రివార్డు ఉందని కందమాల్ జిల్లా పోలీసులు తెలిపారు.