ఓటేయని సభ్యులు 104?
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:20 AM
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు విపక్షం ఓటింగ్‌కు పట్టుబట్టింది.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు విపక్షం ఓటింగ్‌కు పట్టుబట్టింది. దాంతో స్పీకర్ ఓం బిర్లా డివిజన్‌కు అనుమతించారు. గురువారం సభకు 104 మంది సభ్యులు హాజరు కాలేదు. సభలో 543 సీట్లు ఉండగా 3 సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత బలం 540 మంది సభ్యుల్లో కేవలం 436 మంది హాజరయ్యారు. అందులో 251 మంది బిల్లులను ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటేశారు. 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో విపక్షాల అభ్యంతరం వీగిపోయింది. బిల్లుపై చర్చ మొదలైంది. రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశ పెట్టడానికి సాధారణ మెజారిటీ చాలు. నెగ్గించుకొనే సమయంలో 2/3 మెజారిటీ అవసరం. లోక్‌సభలో నిజానికి ఎన్డీఏ బలం 293. అంటే, ఎన్డీయే సభ్యులే 42 మంది రాలేదు. ఇతర పక్షాల నుంచి మరో 62 మంది రాలేదు. నిజానికి బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు మూడు రోజులు సభకు హాజరు కావాల్సిందేనని విప్ జారీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న బెంగాల్, తమిళనాడు ఎంపీలు అన్ని పార్టీల వారు సభకు రాలేదు. వామపక్షాల సభ్యులు కూడా గురువారం సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీలకమైన బిల్లుకు 104 మంది సభ్యులు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే, 2/3 మెజారిటీకి(260+1) చాలా దూరంలో ఉన్న ఎన్డీఏ ఈ బిల్లును నెగ్గించుకోవాలంటే 2/3 మెజారిటీ ఫిగర్‌ను 291కి తగ్గించాలి. అందుకోసం ప్రస్తుతం సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 104 మంది విపక్ష హాజరు కాకుంటే సరిపోతుంది. గురువారం నాటి గైర్హాజరు శాంపిల్ శుక్రవారం జరగబోయే పరిణామాలకు సూచన కావొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి.