మొదటిసారి ట్రెడ్‌మిల్‌తో వ్యాయామం చేస్తున్నారా? అయితే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:57 PM
కొత్తగా ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం మొదలుపెట్టే వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: మొదటిసారి ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ లేదా జాగింగ్ చేసే వారికి మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎంత సేపు వ్యాయామం చేయాలి? వారానికి ఎన్ని రోజులు ట్రెడ్‌మిల్‌ను వాడాలి? ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ విషయమై నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మొదటిసారి ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేసే వారు ఎక్సర్‌సైజులకు అలవాటు పడే వరకూ కొన్ని రోజుల పాటు రోజుకు 20 లేదా 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌ను వాడాలి. దీంతో, శరీరం క్రమంగా దృఢత్వాన్ని పుంజుకుంటుంది. స్టామినా పెరిగే కొద్దీ రోజుకు గంట వరకూ వాకింగ్ లేదా స్ప్రింటింగ్ (పరుగు) చేయొచ్చు.
ఇక హై ఇన్‌టెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్‌తో త్వరగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మొదట ఐదు నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై మెల్లగా నడవాలి. ఆ తరువాత 30 సెకెన్ల పాటు గరిష్ఠ వేగంతో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తాలి. అనంతరం 60 సెకెన్ల పాటు వేగంగా నడవాలి. ఈ పరుగు-నడక క్రమాన్ని కనీసం ఐదు నుంచి పది సార్లు మళ్లీ మళ్లీ చేయాలి. చివరగా ఐదు నిమిషాల పాటు మెల్లగా ట్రెడ్‌మిల్‌పై నడిచి కసరత్తును ముగించాలి. హార్ట్‌రేట్ గరిష్ఠ స్థాయిలో 60 లేదా 70 శాతానికి చేరుకున్నప్పుడు ఒంట్లో కొవ్వు బాగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఏదో కొన్ని రోజుల పాటు కసరత్తులు చేసి మధ్యలో మానేయకుండా దీర్ఘకాలం క్రమశిక్షణతో సాగితే మంచి ఫలితం ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ఒకే రీతిన ఎక్కువ సేపు ట్రెడ్‌మిల్‌పై నడవం లేదా పరిగెత్తడం వంటివి చేస్తే ఫలితాలు కాస్త తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటు ఆహార నియమాలను పాటిస్తే త్వరగా బరువు తగ్గవచ్చని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బెస్ట్ సమ్మర్ డ్రింక్ .. ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారు చేయాలంటే..
వేసవిలో స్కిన్ కేర్ సీక్రెట్స్.. టాన్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు