ఈ సంఖ్య గల వారికి డబ్బుకు కొరతే ఉండదు.. కానీ..!
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:20 PM
సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకతతో పాటు మంచి సంపాదన సామర్థ్యం కలిగి ఉంటారని నమ్మకం.
ఇంటర్నెట్ డెస్క్: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. ఈ సంఖ్యకు శుక్రుడు అధిపతిగా భావిస్తారు. ప్రేమ, అందం, కళలు, సౌకర్యాలు, సంపద వంటి అంశాలకు శుక్రుడిని ప్రతీకగా చెబుతారు.
మూల సంఖ్య 6 ఉన్నవారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రశాంతమైన స్వభావం, స్నేహపూర్వక ప్రవర్తన కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కుటుంబం, స్నేహితులు, బంధాలకు వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. తమకు ఇష్టమైన వారికి కష్టసమయంలో అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. అలాగే కళలు, అందం, సృజనాత్మకతపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతారు.
ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి
మూల సంఖ్య 6 ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. బాధ్యతగా వ్యవహరించడంతో పాటు కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ముందుంటారు. ఫ్యాషన్, కళలు, సంగీతం, సినిమా, హోటల్ రంగం, విద్య, ఇంటీరియర్ డిజైన్, వ్యాపారం, నిర్వహణ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు.
వీరికి సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుందని చెబుతారు. అయితే విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడటం వల్ల కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అందుకే బడ్జెట్‌ను పాటించడం, పొదుపుపై దృష్టి పెట్టడం వీరికి ముఖ్యమని సూచిస్తారు.
ప్రేమ, వివాహ జీవితం
ప్రేమ, వివాహం విషయంలో మూల సంఖ్య 6 ఉన్నవారు నిజాయతీగా, ప్రేమగా, అంకితభావంతో ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. తమ జీవిత భాగస్వామి సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. బంధాలను నిలబెట్టుకోవడానికి శ్రద్ధ చూపడంతో పాటు.. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
భవిష్యత్తు, విజయం
భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలంటే మూల సంఖ్య 6 ఉన్నవారు ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలని సంఖ్యాశాస్త్రం సూచిస్తోంది. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని చెబుతారు. వారి సానుకూల ఆలోచనలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత, కష్టపడే తత్వం కారణంగా సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రంలో పేర్కొంటారు.
Note: ఇందులోని సమాచారం సంఖ్యాశాస్త్రంలో ఉన్న నమ్మకాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ నలుగురి ముందు ఎప్పుడూ ఏడవకండి.. మీ బలహీనతే వారికి బలం!
పెళ్లి గురించి కల వచ్చిందా? శుభమో.. అశుభమో తెలుసుకోండి!