వర్షాకాలంలో విద్యుత్ భద్రత.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:17 PM
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. తడి గోడలు, పాడైన వైరింగ్, సరైన ఎర్తింగ్ లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించడం వంటి చిన్న నిర్లక్ష్యాలు కూడా ప్రాణాపాయానికి దారితీయొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో పిడుగులు, భారీ వర్షాలతో పాటు విద్యుత్ ప్రమాదాల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. తడి గోడలు, పాడైన వైరింగ్, సరైన ఎర్తింగ్ లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకడం వంటి కారణాలతో విద్యుత్ షాక్‌లు తగిలే ప్రమాదం ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి, కొన్నిసార్లు ప్రాణనష్టానికీ దారితీయవచ్చు.
తడి చేతులతో తాకడం ప్రమాదకరం
వర్షాల కారణంగా ఇంటి గోడల్లో తేమ చేరుతుంది. ఆ తేమ స్విచ్‌బోర్డులు లేదా విద్యుత్ వైరింగ్‌కు చేరితే షార్ట్ సర్క్యూట్‌లు జరిగే అవకాశం పెరుగుతుంది. అలాగే ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గీజర్ వంటి విద్యుత్ పరికరాలను తడి చేతులతో తాకడం కూడా ప్రమాదకరం.
ఇంట్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ లేకపోయినా విద్యుత్ ప్రమాదాలు సంభవించవచ్చు. సాధారణంగా ఎర్తింగ్ అదనపు విద్యుత్ ప్రవాహాన్ని భూమిలోకి పంపి మనల్ని రక్షిస్తుంది. ఎర్తింగ్‌లో లోపం ఉంటే విద్యుత్ పరికరాల్లోనే ప్రవాహం ఉండిపోయి షాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు
ఎర్తింగ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి
ఇంటి ఎర్తింగ్ సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలి. ఏవైనా లోపాలు ఉంటే వెంటనే అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించాలి.
తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకవద్దు
నీరు.. విద్యుత్‌ను సులభంగా ప్రసారం చేస్తుంది. కాబట్టి తడి చేతులతో స్విచ్‌లు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి పరికరాలను ఉపయోగించవద్దు. ఎప్పుడూ ISI ప్రమాణాలు ఉన్న నాణ్యమైన విద్యుత్ పరికరాలనే ఉపయోగించాలి.
ప్లగ్‌లు, సాకెట్లను జాగ్రత్తగా ఉపయోగించాలి
ముందుగా ప్లగ్ పెట్టి, తర్వాతే స్విచ్ ఆన్ చేయండి.
ప్లగ్ తీసేటప్పుడు వైర్‌ను లాగకుండా ప్లగ్‌ను పట్టుకుని తీసేయండి.
పిల్లలకు అందని చోట సాకెట్ బోర్డులను ఏర్పాటు చేయండి.
పెద్ద విద్యుత్ పరికరాలకు సేఫ్టీ ప్లగ్‌లు లేదా రక్షణ పరికరాలు ఉపయోగించడం మంచిది.
రబ్బరు చెప్పులు, చేతి తొడుగులు ధరించండి
విద్యుత్ మరమ్మతులు చేసే సమయంలో రబ్బరు చెప్పులు లేదా బూట్లు ధరించండి. అవసరమైతే రబ్బరు గ్లౌజులు కూడా ఉపయోగించండి.
నీటి దగ్గర విద్యుత్ పరికరాలు ఉంచవద్దు
ఫ్రిజ్, గీజర్, వాషింగ్ మెషీన్ వంటి పరికరాలను కుళాయిలు లేదా నీరు చేరే ప్రదేశాల దగ్గర ఉంచకండి. పాడైన వైర్లు, దెబ్బతిన్న ప్లగ్‌లను వెంటనే మార్చేయండి.
జాగ్రత్తే రక్షణ
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. కాబట్టి ఇంట్లోని విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, భద్రతా నియమాలను పాటించడం చాలా అవసరం. విద్యుత్ విషయంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు