మాపై మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:22 AM
పాక్‌తో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించారు. పోరు ఆలోచనలు విరమించి తమతో చర్చలకు రావాలని కేంద్రాన్ని కోరారు.
అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నాం: జర్దారీ
న్యూఢిల్లీ, మార్చి 3: పాక్‌తో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించారు. పోరు ఆలోచనలు విరమించి తమతో చర్చలకు రావాలని కేంద్రాన్ని కోరారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య జరిగిన పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. మరో యుద్ధానికి సిద్ధమవుతున్నామని భారతదేశ నాయకులు చెబుతున్నారని, అయితే ప్రాంతీయ శాంతికి జీవిత కాల ప్రతినిధిగా తాను ఇలాంటి చర్యలకు వ్యతిరేకమని తెలిపారు. యుద్ధం చేయాలన్న ఆలోచనలు విరమించి, అర్థవంతమైన చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జర్దారీ విమర్శించారు. ఇది జల ఉగ్రవాదమని, రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకూ దక్షిణాసియాలో శాశ్వతం గా శాంతి నెలకొనడం అసాధ్యమని పేర్కొన్నారు. దోహా ఒప్పందం ప్రకా రం అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర గ్రూపులు పనిచేయకుండా నిరోధిస్తామని చేసిన వాగ్దానాన్ని అమలు చేయడంలో తాలిబన్ ప్రభుత్వం విఫలమైందన్నారు.