15 వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:48 AM
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’.. ఎంపిక చేసిన కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 30 రోజుల్లో 15 ఒరిజినల్ వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు..
‘వీడియో కిక్‌స్టార్ట్ బోనస్’ పేరిట ఎక్స్ ఆఫర్
ఆహ్వానం అందిన క్రియేటర్లకే అవకాశం
వాషింగ్టన్, అక్టోబరు 19: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’.. ఎంపిక చేసిన కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 30 రోజుల్లో 15 ఒరిజినల్ వీడియోలు పోస్ట్ చేస్తే రూ.2.85 లక్షలు (3వేల డాలర్లు) అందించే ‘వీడియో కిక్‌స్టార్ట్ బోనస్’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అయితే, ఈ సొమ్ములు పొందే అవకాశం అందరికీ లేదు. సంస్థ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిన క్రియేటర్లు మాత్రమే ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ బోనస్ దక్కించుకోవాలంటే 30 రోజుల వ్యవధిలో 15 వేర్వేరు రోజుల్లో కనీసం 15 వీడియోలు పోస్ట్ చేయాలి. ప్రతి వీడియో మూడు నిమిషాల్లోపు నిడివి కలిగి, నిలువుగా (వర్టికల్ ఫార్మాట్) ఉండాలి. సొంతంగా రూపొందించిన వీడియోలకే అర్హత ఉంటుంది. గతంలో ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సొంత వీడియోలనూ అప్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, వాటికి వాటర్‌మార్కులు లేకుండా చూసుకోవాలి. వీడియోలకు ఎన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయడం ప్రధాన అర్హతగా ఎక్స్ పేర్కొంది. ఆహ్వానితులు అక్టోబరు 30లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.