X Platform: ఫొటోలను బికినీల్లోకి మార్చడం తప్పే: ‘ఎక్స్’
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:11 AM
కేంద్ర ఐటీ శాఖ తాఖీదుల దెబ్బతో.. ‘గ్రోక్’ ఏఐ దుశ్శాసనపర్వానికి అడ్డుకట్ట పడింది! వినియోగదారులు అడిగిందే తడవుగా ఎవరి ఫొటోనైనా బికినీల్లోకి, అశ్లీలంగా, అసభ్యంగా...
న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర ఐటీ శాఖ తాఖీదుల దెబ్బతో.. ‘గ్రోక్’ ఏఐ దుశ్శాసనపర్వానికి అడ్డుకట్ట పడింది! వినియోగదారులు అడిగిందే తడవుగా ఎవరి ఫొటోనైనా బికినీల్లోకి, అశ్లీలంగా, అసభ్యంగా మార్చేయడం తప్పేనని ఈలన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ అంగీకరించింది. తన తప్పును ఒప్పుకొంటూ.. ఇలా ఫొటోలను అశ్లీలంగా మార్చాలని గ్రోక్‌ను అడిగిన 600 మంది ఖాతాలను, అశ్లీల కంటెంట్ ఉన్న 3500 పోస్టులను తొలగించింది. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని.. భారతీయ చట్టాలకు లోబడి అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఇకమీదట గ్రోక్‌ను ఎవరైనా అలా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఇవ్వాలని అడిగినా, అశ్లీల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినా వారి అకౌంట్లనూ తొలగిస్తామని హెచ్చరించింది. బ్రిటన్, ఈయూ దేశాలు కూడా గ్రోక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ముగ్గురు సెనెటర్లు ‘ఎక్స్’ని, గ్రోక్‌ని యాప్‌స్టోర్ల నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు లేఖ రాశారు.