Share News

Explicit Content: గ్రోక్‌.. దుశ్శాసన పర్వం!

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:38 AM

ఒక కాలేజీ అమ్మాయి.. పార్కుకు వెళ్లినప్పుడు తీసుకున్న తన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది.. నిండుగా డ్రెస్‌ చేసుకుని ముగ్ధమనోహరంగా ఉన్న ఆమె చిత్రాన్ని ఎంతో మంది లైక్‌ చేశారు.. కానీ కాసేపటికి చూసుకుంటే.. తన పోస్టు కింద తనవే అశ్లీల చిత్రాలు! అతి చిన్న వస్త్రాల్లో..

Explicit Content: గ్రోక్‌.. దుశ్శాసన పర్వం!

  • మహిళలు, చిన్నారుల చిత్రాలను అసభ్యకరంగా మారుస్తున్న ‘ఎక్స్‌’ ఏఐ టూల్‌

  • ఎక్స్‌లో ‘బికినీ’ ట్రెండ్‌పై ఆందోళన

(సెంట్రల్‌ డెస్క్‌)

ఒక కాలేజీ అమ్మాయి.. పార్కుకు వెళ్లినప్పుడు తీసుకున్న తన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది.. నిండుగా డ్రెస్‌ చేసుకుని ముగ్ధమనోహరంగా ఉన్న ఆమె చిత్రాన్ని ఎంతో మంది లైక్‌ చేశారు.. కానీ కాసేపటికి చూసుకుంటే.. తన పోస్టు కింద తనవే అశ్లీల చిత్రాలు! అతి చిన్న వస్త్రాల్లో.. బికినీ ధరించినట్టుగా, స్విమ్‌సూట్‌ వేసుకున్నట్టుగా, పారదర్శక వస్త్రాల్లో ఉన్నట్టుగా అసభ్యకరంగా ఉన్న ఆ చిత్రాలను చూసి హతాశురాలైంది. ‘ఎక్స్‌’కు అనుసంధానమై ఉన్న కృత్రిమ మేధ టూల్‌ ‘గ్రోక్‌’తో సృష్టించిన చిత్రాలు అవి. యూజర్లు కేవలం ఒక చిన్న ‘ప్రాంప్ట్‌ (సూచన)’ ఇస్తే చాలు, వారు అడిగినట్టుగా చిత్రాలను ‘గ్రోక్‌’ మార్చేస్తోంది. చాలా మంది యూజర్లు ఎక్స్‌లో పోస్టు చేసిన మహిళలు, బాలికల ఫొటోల కింద.. ‘గ్రోక్‌ ఈమెను బికినీలోకి మార్చు.. స్విమ్‌సూట్‌లోకి మార్చు.. గుండుతో ఉన్నట్టు మార్చు.. మీసాలు, గడ్డాలు పెట్టు..’ ఇష్టమొచ్చినట్టు ప్రాంప్ట్‌ ఇస్తున్నారు. వారు అడిగినట్టుగా చిత్రాలను ‘గ్రోక్‌’ మార్చేస్తోంది. కొందరు యూజర్లు సోషల్‌ మీడియా యాప్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న, నేరుగా తీసిన మహిళలు, బాలికల చిత్రాలను కూడా అప్‌లోడ్‌ చేసి అసభ్యంగా, అశ్లీలంగా మార్చుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు చేస్తూ మహిళలు తీసుకున్న ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొన్ని రోజులుగా ఎక్స్‌లో ఈ ‘బికినీ’ ట్రెండ్‌గా పిలుస్తున్న ఈ వ్యవహారం కొన్ని రోజులుగా ‘ఎక్స్‌’లో ట్రెండింగ్‌గా మారింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

క్షమాపణ చెబుతూనే..!

ఒక యూజర్‌ 12, 13 ఏళ్ల ఇద్దరు బాలికల చిత్రాలను బికినీలో ఉన్నట్టుగా మార్చాలని ప్రాంప్ట్‌ ఇస్తే.. గ్రోక్‌ అలా మార్చి పోస్టు చేసింది. ‘‘ఇది తప్పు కదా..’’ అని యూజర్లు ‘గ్రోక్‌’ను ప్రశ్నిస్తే.. చట్టాల ప్రకారం, నైతికపరంగా ఇది తప్పేనని ‘గ్రోక్‌’ కూడా అంగీకరిస్తోంది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నానంటూనే.. తాను కృత్రిమ మేధను కాబట్టి, యూజర్లు ఇస్తున్న ప్రాంప్ట్‌లకు అనుగుణంగా కంటెంట్‌ ఇస్తున్నానని సమాధానం చెబుతోంది. కానీ యూజర్లు అడిగిన కొద్దీ అసభ్యకరంగా చిత్రాలను మార్చుతూనే ఉంది. ఒక్క ‘గ్రోక్‌’ అనే కాదు.. చాలా కృత్రిమ మేధ టూల్స్‌ కూడా యూజర్లు అడిగినట్టుగా ఫొటోలను మార్చి ఇస్తున్నాయి.


తన ఫొటోను ‘బికినీ’లోకి మార్చుకున్న మస్క్‌!

ఎక్స్‌లో బికినీ ట్రెండ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో దీనిని ఎగతాళి చేస్తున్నట్టుగా ‘ఎక్స్‌’ యజమాని ఎలాన్‌ మస్క్‌ స్పందించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక యూజర్‌ పెట్టిన పోస్టులో తన ఫొటోను కూడా బికినీలోకి మార్చాలని మస్క్‌ ప్రాంప్ట్‌ ఇచ్చారు. దీనితో గ్రోక్‌ మస్క్‌ బికినీలో ఉన్నట్టుగా ఫొటోను సృష్టించి పోస్టు చేసింది. దీనికి సమాధానంగా ‘పర్ఫెక్ట్‌’ అంటూ మస్క్‌ కామెంట్‌ పెట్టడం గమనార్హం. కాగా, బికినీ ట్రెండ్‌పై విమర్శలు పెరగడం, భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపైనా మస్క్‌ స్పందించారు. గ్రోక్‌ను ఉపయోగించి తప్పుడు, అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సదరు ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. అయితే ‘‘గ్రోక్‌ ఏఐ టూల్‌ను ఉపయోగించి అశ్లీల, అసభ్య, తప్పుడు కంటెంట్‌ సృష్టిస్తున్న వినియోగదారులదే తప్పు. ఏదైనా పెన్నుతో తప్పుగా రాస్తే.. ఆ తప్పు రాసేవారిదే అవుతుంది తప్ప పెన్నుది కాదు. మీరు ఎలాంటి ఇన్‌పుట్‌ ఇస్తారో దానికి తగినట్టుగా గ్రోక్‌ ఔట్‌పుట్‌ ఇస్తుందని గుర్తుంచుకోవాలి’’ అని మస్క్‌ వ్యాఖ్యానించారు.

అశ్లీలానికి అడ్డాగా ‘ఎక్స్‌’!

చాలా సోషల్‌ మీడియా వేదికల్లో అశ్లీల కంటెంట్‌పై నియంత్రణ ఉంది. ఏ మాత్రం అశ్లీలంగా, అసభ్యంగా ఉన్నా.. ఫొటోలను, వీడియోలను, ఇతర కంటెంట్‌ను వెంటనే తొలగించేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మేరకు తమ అల్గారిథమ్స్‌ను రూపొందించుకున్నాయి. కానీ ‘ఎక్స్‌’ మాత్రం చాలా వరకు అశ్లీల కంటెంట్‌ను అనుమతిస్తోంది. ఈ సామాజిక మాధ్యమం అందుబాటులో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఆ అశ్లీల కంటెంట్‌ను పోస్టు చేసే, వీక్షించే అవకాశం ఉంది. ‘ఎక్స్‌’ తాము అనుసరించే మార్గదర్శకాలు, విధానాల పత్రంలోనే.. ‘పరిమితి మేరకు అడల్ట్‌ కంటెంట్‌’ను అనుమతిస్తున్నట్టుగా పేర్కొనడం గమనార్హం.

Updated Date - Jan 05 , 2026 | 02:38 AM