డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడికి ఎప్‌స్టీన్ దెబ్బ!
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:14 AM
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు బయటికి రావడంతో ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈవో బార్జ్ బ్రెన్డే పదవి నుంచి వైదొలిగారు.
వివాదంతో పదవి వీడిన బార్జ్ బ్రెన్డే
ఎప్‌స్టీన్ బార్జ్ సంబంధాలపై డబ్ల్యూఈఎఫ్ స్వతంత్ర దర్యాప్తు
జెనీవా, ఫిబ్రవరి 26: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు బయటికి రావడంతో ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈవో బార్జ్ బ్రెన్డే పదవి నుంచి వైదొలిగారు. హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో పదవిని వీడుతున్నట్టు గురువారం ఆయన ప్రకటించారు. ఎప్‌స్టీన్‌తో కలిసి మూడు బిజినెస్ డిన్నర్‌లలో బార్జ్ పాల్గొన్నట్టు, మెయిల్‌లు, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా అతనితో సంప్రదింపులు నెరపినట్టు ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో వెల్లడైంది. ‘బాగా ఆలోచించాకే డబ్ల్యూఈఎఫ్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ పదవిలో ఎనిమిదిన్నరేళ్లు ఫలవంతంగా పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఇంతకాలం నాకు అద్భుతమైన సహకారం అందించిన సహచరులు, భాగస్వాములకు కృతజ్ఞతలు. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫోరం ముఖ్యమైన కార్యకలాపాలు కొనసాగిస్తుందని భావిస్తున్నాను’ అని బార్జ్ పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌తో బార్జ్‌కు ఉన్న సంబంధాలపై ఈనెల మొదట్లోనే డబ్ల్యూఈఎఫ్ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. బార్జ్ రాజీనామా నేపథ్యంలో అలోయిస్ జ్విన్‌గి తాత్కాలిక అధ్యక్షుడు, సీఈవోగా కొనసాగుతారని డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. నాయకత్వ మార్పును, అలాగే, శాశ్వత అధ్యక్షుడి నియామక ప్రక్రియను ఫోరం ట్రస్టీల బోర్డు పర్యవేక్షిస్తుందని తెలిపింది. డబ్ల్యూఈఎఫ్ అధ్యక్ష పదవికి ముందు నార్వే ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా బార్జ్ పనిచేశారు.