అమెరికా దాడులను సమర్థిస్తున్నాం
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:52 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమైన నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల అధినేతలు స్పందించారు.
ఆస్ట్రేలియా, కెనడా ప్రకటన.. అగ్రరాజ్యం తీరును ఖండించిన రష్యా, చైనా
బ్రసెల్స్, న్యూఢిల్లీ, మార్చి 1 : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమైన నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల అధినేతలు స్పందించారు. తక్షణం చర్చలు జరపాలని ఆయా దేశాలకు సూచించారు. లేని పక్షంలో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటరెస్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ దాడులు అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు. దాడులను వైరి పక్షాలు తక్షణం నిలిపివేయాలని సూచించారు. వెంటనే చర్చలు జరపాలని పలు దేశాల అధినేతలు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల అధినేతలు ఏమన్నారో పరిశీలిస్తే..
సమర్థించిన దేశాలు

అమెరికా చర్యలకు మద్దతు : ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంథోని
ఇరాన్ అణు బాంబును సమకూర్చుకోకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నాం. ఇరాన్‌లో ప్రస్తుతమున్నది ప్రపంచంలో అస్థిరత్వాన్ని పెంచే నాయకత్వం. ఆస్ట్రేలియా గడ్డపై వారి ఆధ్వర్యంలో రెండు దాడులు కూడా జరిగాయి. (గత ఆగస్టులో ఆస్ట్రేలియా ఇరాన్‌తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇరాన్ రాయబారిని బహిష్కరించింది.)

ఇరాన్ దాడులు సరికాదు : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ విచక్షణారహిత దాడులు సరికాదు. ఇరాన్ ప్రస్తుత పాలకవర్గం అసమ్మతిని అణచివేసేందుకు వేలాది మంది సొంత ప్రజలను హత్య చేసింది. ఆ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణమైంది. వారు ఎట్టి పరిస్థితిలోనూ అణు బాంబును సమకూర్చుకోకూడదు. అదే మా, మా మిత్ర పక్షాల ప్రధాన లక్ష్యం.
మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాదానికి ఇరానే కారణం : కెనడా ప్రధాని
మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అస్థిరత్వానికి, ఉగ్రవాదానికి ఇరానే కారణం. అమెరికా చేపట్టిన సైనిక చర్యకు మద్దతిస్తున్నాం.
చర్చలతోనే సమస్యకు పరిష్కారం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్
కేవలం సైనిక చర్యలతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణుల తయారీని, ప్రాంతీయ స్థిరత్వాన్ని సాధించలేం. ఇరాన్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి గట్టి చొరవ తీసుకోవాల్సి ఉంది. ఈ దాడులతో ఫ్రాన్స్‌కు సంబంధం లేదు.
పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు సరికాదు : 22 దేశాల అరబ్ లీగ్
ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్న పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు వాటి సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. విచక్షణారహితమైన ఈ దాడుల వల్ల ఈ ప్రాంతమంతటికీ యుద్ధం విస్తరించే ప్రమాదముంది. తక్షణం సైనిక చర్యలు ఆపి చర్చలు జరపాలి.
వ్యతిరేకించిన దేశాలు

దాడులను ఆపాలి : రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నైతిక విలువలను ఉల్లంఘించి చేపట్టిన దారుణ చర్య. దీన్ని ఖండిస్తున్నాం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపాలి.

ఇరాన్‌పై దాడులు ఆందోళనకరం : చైనా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తక్షణం సైనిక చర్యలను నిలిపివేసి చర్చలు జరపాలని కోరుతున్నాం. ఇరాన్ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతను గౌరవించాలి.
దాడులు సరికాదు : స్పెయిన్ ప్రధాని సాంచెజ్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులను ఖండిస్తున్నాం. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతాయి. తక్షణం దాడులను నిలిపివేయాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. చర్చలు జరిపి ఆ ప్రాంతంలో సమస్యలకు పరిష్కారం సాధించాలి.
ఖమేనీ హత్యను ఖండిస్తున్నాం : కాంగ్రెస్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఖండిస్తున్నాం. ఇది కావాలని చేసిన హత్య. ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు మా సానుభూతి. సైనిక చర్యల ద్వారా కాకుండా.. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. పశ్చిమాసియాలో ఘర్షణలు ఆందోళనకరం.