Share News

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:34 AM

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భేరి మోగుతోంది. చమురు ట్యాంకర్లు, నౌకలపై ఇరాన్‌ దాడులు చేస్తుండటం, ఇరాన్‌పై మరోసారి భారీ దాడికి దిగాలని అమెరికా, ఇజ్రాయెల్‌ యోచిస్తున్నట్టుగా వస్తున్న వార్తలతో ఒకవైపు..

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

  • సౌదీ ఆరామ్‌కో, విమానాశ్రయంపై హుతీల దాడులు.. ఓ భారతీయుడి మృతి

  • ఎర్ర సముద్రంలో 14 మంది భారతీయులున్న పడవపై సౌదీ దాడులు!

  • హోర్ముజ్‌లో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పైకి ఇరాన్‌ క్షిపణులు

  • ఇలా నౌకలను తరలించేందుకు ప్రయత్నిస్తే అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తాం: ఇరాన్‌

  • ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా, ఇజ్రాయెల్‌ యోచన!

  • ఇటు హోర్ముజ్‌లో, అటు ఎర్ర సముద్రంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు

దుబాయ్‌/టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 22: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భేరి మోగుతోంది. చమురు ట్యాంకర్లు, నౌకలపై ఇరాన్‌ దాడులు చేస్తుండటం, ఇరాన్‌పై మరోసారి భారీ దాడికి దిగాలని అమెరికా, ఇజ్రాయెల్‌ యోచిస్తున్నట్టుగా వస్తున్న వార్తలతో ఒకవైపు.. సౌదీ ఆరామ్‌కోపై హుతీల దాడులు, సౌదీ, యెమెన్‌ దళాల దాడులతో మరోవైపు తీవ్ర ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్కో బ్యారెల్‌ ధర 112డాలర్లకు చేరింది. హోర్ముజ్‌లో, ఎర్ర సముద్రంలో, సౌదీలో జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది కూడా ప్రభావితం కావడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆరామ్‌కో చమురు కేంద్రంపై దాడులు

సౌదీ అరేబియాలోని కీలకమైన ఆరామ్‌కో చమురు కేంద్రం, దమ్మామ్‌లోని కింగ్‌ ఫాహద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై హుతీలు గురువారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగారు. ఇరు ప్రాంతాల్లోనూ పేలుళ్లు సంభవించి, మంటలు చెలరేగాయి. దమ్మామ్‌ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు మృతిచెందారని, మరో ఇద్దరు భారతీయులు సహా 8మంది గాయపడ్డారని... ఆరామ్‌కో చమురు క్షేత్రంపై దాడిలో ఇంకో భారతీయుడు సహా పలువురు గాయపడ్డారని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఎర్ర సముద్రంలో 14 మంది భారతీయులు ప్రయాణిస్తున్న పడవపై సౌదీ అరేబియా దాడి చేసిందని హుతీలు గురువారం ప్రకటించారు. జుఖర్‌ దీవి సమీపంలో భారతీయులున్న పడవపై సౌదీ దాడి చేసిందని, యెమెన్‌ నౌకాదళం వారందరినీ రక్షించిందని హుతీల ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. అయితే ఈ విషయాన్ని సౌదీగానీ, భారత్‌ గానీ ధ్రువీకరించలేదు. కాగా, సౌదీ దమ్మామ్‌ ఎయిర్‌పోర్టుపై హుతీల దాడులను భారత విదేశాంగ శాఖ ఖండించింది. పౌర, ఇంధన మౌలిక వసతులపై దాడులు సరికాదని పేర్కొంది.


7చమురు నౌకలను దెబ్బతీశాం: ఇరాన్‌

తాము చేసిన దాడుల్లో, సముద్రపు మందుపాతరల (సీమైన్స్‌)ను ఢీకొని 7 చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నట్టు ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) గురువారం ప్రకటించింది. గల్ఫ్‌లో నాలుగు చమురు నౌకలపై తమ నావికాదళం దాడి చేసిందని.. హోర్ముజ్‌లో సీమైన్లను ఢీకొని మూడు చమురు ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయని పేర్కొంది. అమెరికా ఇలాగే చమురు నౌకలను హోర్ముజ్‌ దాటించడానికి ప్రయత్నిస్తుంటే.. పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై దాడులకు దిగుతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో ఒమన్‌ తీరానికి సమీపంలో కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న అల్‌ దస్మా చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో 21 మంది భారతీయులు సహా 40 మంది వరకు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ దాడిలో ప్రాణనష్టమేదీ జరగలేదు.

ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులకు యోచన!

త్వరలో ఇజ్రాయెల్‌లో సాధారణ ఎన్నికలు, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నెతన్యాహుకు, అమెరికాలో ఎన్నికలు ట్రంప్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో ప్రజల్లో మద్దతు పెంచుకునేందుకు వారు ఇరాన్‌పై మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

112 డాలర్లకు చేరిన చమురు..

ఇరాన్‌పై అమెరికా దాడులతో హోర్ముజ్‌లో రవాణా నిలిచిపోవడం, ఇటు ఎర్రసముద్రంలో సమస్యలతో అంతర్జాతీయంగా చమురు రవాణాపై ప్రభావం పడింది. చమురు ధరలు ఎగిసిపడుతున్నాయి. గురువారం ఏకంగా బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరాయి. మరోవైపు, హుతీలు ఇటీవల సౌదీలోని కీలక విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలపై దాడులు మొదలుపెట్టారు. కీలకమైన బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిపై పట్టు సాధించారు. దీనివల్ల కూడా చమురు ధలు పెరుగుతున్నాయి.

Updated Date - Oct 23 , 2026 | 03:37 AM