థరూర్ కుమారుడిపై‘ వాషింగ్టన్ పోస్టు’ వేటు
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:45 AM
లే-ఆ్‌ఫల సెగ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్‌కూ తగిలింది. ఉద్యోగాల్లో కోతలో భాగంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్టు’ ఆయనతోపాటు 300 మంది జర్నలిస్టు లు, ఉద్యోగులను తొలగించింది.
ఇషాన్ థరూర్ సహా 300 మంది జర్నలిస్టులు, సిబ్బంది తొలగింపు
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: లే-ఆ్‌ఫల సెగ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్‌కూ తగిలింది. ఉద్యోగాల్లో కోతలో భాగంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్టు’ ఆయనతోపాటు 300 మంది జర్నలిస్టు లు, ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో్‌సకు చెందిన ఈ పత్రిక.. స్పోర్ట్స్ డెస్క్‌ను, విదేశీ బ్యూరోలను మూసివేసింది. అలాగే పుస్తకాల కవరేజీని కూడా ఆపేసింది. ఇషాన్ ఇక్కడ సీనియర్ అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్టుగా పనిచేస్తున్నారు. వాషింగ్టన్ పోస్టులో 800 మంది జర్నలిస్టులు ఉన్నారని.. వారిలో 300 మంది పైచిలుకును యాజమాన్యం బుధవారం తొలగించిందని మరో పత్రిక ‘ది న్కూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఇషాన్ కూడా తన తొలగింపును ‘ఎక్స్’లో ధ్రువీకరించారు. వాషింగ్టన్ పోస్టు కార్యాలయంలో చర్చల్లో తాను పాల్గొన్న న్యూస్‌రూం ఫొటో పెట్టి.. ‘చీకట్లో ప్రజాస్వామ్యం చనిపోయింది’ అంటూ ఓ పోస్టరు పెట్టారు. దానికి ‘దుర్దినం’ అనే శీర్షిక పెట్టారు. ‘నాతో పాటు పలువురు అంతర్జాతీయ సిబ్బందిని, అద్భుతమైన సహచరులను ఉద్యోగం నుంచి తొలగించారు. నిర్భయంగా వ్యవహరిస్తూ 12 ఏళ్లుగా వాషింగ్టన్ పోస్టుకు సేవలందిస్తున్న నా మిత్రులైన ఎడిటర్లు, కరెస్పాండెంట్లను తీసివేయడంతో గుండె బద్దలైంది. వారితో కలిసి పనిచేయడం ఓ గౌరవం’ అని ఆయన పోస్టు చేశారు. కాగా.. ఇషాన్ సహా 300 మందిని తొలగించడం బాధగానే ఉందని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే పేర్కొన్నారు. 1877లో ‘వాషింగ్టన్ పోస్టు’ ఆవిర్భవించింది. ఈ పత్రిక 2023లో 7 కోట్ల డాలర్లు, 2024లో 10 కోట్ల డాలర్లు నష్టపోయినట్లు అంచనా. వాషింగ్టన్ పోస్టు తీసుకున్న నిర్ణయం అసాధారణం.. ఆత్మహత్యాసదృశమని శశి థరూర్ ‘ఎక్స్’లో ఆగ్రహం చేశారు.