యుద్ధం కొనసాగితే.. సంక్షోభమే!
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:13 AM
ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడి ప్రభావం యావత్ ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోయి, ఫలితంగా నిత్యావసరాల ధరలూ ఆకాశన్నంటే ప్రమాదం ఉంది.
ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయే అవకాశం
హొర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే చమురు ధరలు పైపైకి
మన చమురు దిగుమతుల్లో సగం హొర్ముజ్ మీదుగానే
(సెంట్రల్‌డెస్క్)
ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడి ప్రభావం యావత్ ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోయి, ఫలితంగా నిత్యావసరాల ధరలూ ఆకాశన్నంటే ప్రమాదం ఉంది. స్టాక్‌మార్కెట్ల మీద, బంగారం, వెండి ధరలపైనా తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ తన చమురు నిల్వలను స్వేచ్ఛగా విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ, నేటికీ టాప్ 10 చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాన్ ఉంది. 1974లో ఇరాన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 60 లక్షల బ్యారెళ్లు కాగా, ప్రస్తుతం ఆంక్షల కారణంగా అది 31 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. వీటిలో 13 నుంచి 15లక్షల బ్యారెళ్లను ఎగుమతి చేస్తోంది. ఇరాన్ మీద దాడుల కారణంగా.. ఆ దేశం నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాదు, ప్రపంచంలోని చమురు నిల్వల్లో మూడోవంతు ఇరాన్‌లోనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించే క్షిపణులు, బాంబుల దాడుల్లో అవి ధ్వంసమైతే.. నష్టం ఒక్క ఇరాన్‌కే కాదు.. యావత్ ప్రపంచానికి ఉంటుంది.
హొర్ముజ్ జలసంధి అడ్డగింత!
ఇరాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రం హొర్ముజ్ జలసంధి. ఇరాన్‌కు ఒమన్‌కు మధ్య ఉండే ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీ జలమార్గం. 2024లో హొర్ముజ్ జలసంధి ద్వారా ప్రతి రోజూ 2కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20ు. హొర్ముజ్ జలసంధి చాలా ఇరుగ్గా ఉంటుంది. వెడల్పు కేవలం 50 కి.మీ.లు. భౌగోళికంగా ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా ఆ జలసంధిని నియంత్రించటం చాలా సులువు. అమెరికా గతంలో ఆంక్షలు విధించినప్పుడు, దాడులు జరిపినప్పుడు ఇరాన్ ఈ జలసంధిని పలుమార్లు అడ్డుకుంది. ఫలితంగా, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తలెత్తవచ్చు. ఈ విధంగా.. చమురు రవాణా తగ్గిపోయి, నిల్వలకు కొరత ఏర్పడి.. బ్యారెల్ ధర ఏకంగా 100 డాలర్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు (ప్రస్తుతం ఇది 73 డాలర్లుగా ఉంది). చమురు ధర పెరిగితే ఆహారం, నిర్మాణ రంగం తదితర అన్ని రంగాల్లోనూ ధరలు పెరుగుతాయి.
భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం
భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు నిల్వల్లో దాదాపు సగం(రోజుకు 26 లక్షల బ్యారెళ్లు) హొర్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతున్నాయి. కాబట్టి, ఈ జలసంధిలో ఎటువంటి అంతరాయం తలెత్తినా మన చమురు వినియోగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. యూఏఈ, సౌదీఅరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, ఇరాన్ దేశాలకు భారత్ నుంచి వెళ్లే చమురుయేతర ఎగుమతుల్లో దాదాపు 13.2శాతం హొర్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంటాయి. వీటి విలువ 36,000 కోట్ల డాలర్లు. ఇంత భారీ ఎగుమతులూ దెబ్బతినే ప్రమాదం ఉంది. స్టాక్‌మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
అబుదాభిలో చిక్కుకున్న తెలుగువాళ్లు
100 మందికిపైగా విమానాశ్రయంలోనే!
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన సుమారు 100 మందికిపైగా తెలుగువాళ్లు అబుదాభి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరిన ఇతిహాద్ విమానం మార్గమధ్యలో అబుదాభి విమానాశ్రయంలో ఆగింది. అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరాల్సిన ఈ విమానం ఇరాన్ వైమానిక దాడుల కారణంగా అబుదాభిలోనే ఆగిపోయింది. అబుదాభి విమానాశ్రయం సమీపంలోనే శనివారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిగాయి. దీంతో అబుదాభి గగనతలాన్ని మూసివేశారు.