Share News

ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత!

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:01 AM

ఇప్పటికే భారీగా ఉద్యోగుల తొలగింపుతో టెక్‌ రంగం ఆందోళనలో పడితే.. ఇప్పుడు ఆటోమొబైల్‌ రంగానికీ లేఆ్‌ఫల గండం పట్టుకుంది. జర్మనీకి చెందిన ప్రపంచ దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ 50వేల మంది ఉద్యోగుల..

ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత!

  • ఇప్పటికే 50 వేల మంది తొలగింపు ప్రక్రియ మొదలు

  • వచ్చే నాలుగేళ్లలో మరో 50 వేల మందికి ఉద్వాసన

  • ఫోక్స్‌వ్యాగన్‌తోపాటు ఆడి, పోర్షే, లాంబోర్గిని బ్రాండ్లలోని మోడళ్లు, వేరియంట్ల తగ్గింపునకు నిర్ణయం

  • ఒరాకిల్‌లో గుట్టుగా ఉద్యోగుల తొలగింపు!

  • ప్రపంచవ్యాప్తంగా 7-10 వేల మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ఇప్పటికే భారీగా ఉద్యోగుల తొలగింపుతో టెక్‌ రంగం ఆందోళనలో పడితే.. ఇప్పుడు ఆటోమొబైల్‌ రంగానికీ లేఆ్‌ఫల గండం పట్టుకుంది. జర్మనీకి చెందిన ప్రపంచ దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ 50వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టినట్టు శుక్రవారం ప్రకటించింది. 2030 నాటికి మరో 50వేల ఉద్యోగాలకూ కోతపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపింది. చైనా ఆటోమొబైల్‌ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని, అమెరికా సుంకాలను తట్టుకోవడం కోసం.. కంపెనీ పునర్వ్యవస్థీకరణ, వ్యయాల తగ్గింపు దిశగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఆ పేరుతో పాటు ఆడి, పోర్షే, లాంబోర్గిని వంటి విలాసవంతమైన బ్రాండ్ల కార్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఇటీవలికాలంలో చైనాకు చెందిన బీవైడీ, ఇతర సంస్థల నుంచి తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన కార్లు.. ఫోక్స్‌వ్యాగన్‌ సహా ఇతర ప్రధాన వాహన సంస్థలకు గట్టిపోటీని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యయ నియంత్రణపై ఫోక్స్‌వ్యాగన్‌ దృష్టిపెట్టింది. వివిధ బ్రాండ్ల కింద విక్రయిస్తున్న వాహనాల మోడళ్లు, వేరియంట్ల సంఖ్యను తగ్గించాలని, జర్మనీలోని నాలుగు ప్లాంట్లలో ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించింది. భారత్‌లోని ఫోక్స్‌వ్యాగన్‌ ఉద్యోగుల్లో సుమారు 12శాతం మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది భారీగా ఉద్యోగులను తొలగించిన టెక్‌ కంపెనీల్లో టాప్‌లో నిలిచిన ఒరాకిల్‌.. నిశ్శబ్ధంగా మరికొంత మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు టెక్‌వర్గాలు చెబుతున్నాయి. గత 8నెలల్లో 21వేల మందిని ఇంటికి పంపిన ఒరాకిల్‌.. మరో 7వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని పేర్కొంటున్నాయి. ఒరాకిల్‌కు చెందిన అంతర్గత సమాచార యాప్‌ ‘స్లాక్‌’లో ఉద్యోగుల ఖాతాలు, కంపెనీ ఈ-మెయిల్‌ యాక్సెస్‌ నిలిచిపోతున్నాయని వెల్లడించాయి. ఎవరెవరిని తొలగిస్తున్నారో తెలియకపోయినా.. స్లాక్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని తెలిపాయి.

Updated Date - Sep 05 , 2026 | 05:03 AM