అరబ్బు గడ్డపై ఏడుకొండల స్వామి కల్యాణోత్సవం
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:38 AM
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బహ్రెయిన్‌లో జరిగిన ఈ వేడుకకు సౌదీ అరేబియా, ఖతర్ తదితర దేశాల..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బహ్రెయిన్‌లో జరిగిన ఈ వేడుకకు సౌదీ అరేబియా, ఖతర్ తదితర దేశాల నుంచి అధిక సంఖ్యలో తెలుగు కుటుంబాలు తరలివచ్చాయి. తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు రాఘవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఆర్.శ్రీనివాసన్ స్వామి, శ్రీనివాసమూర్తి వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి ఏకాంత సేవ వరకు కొనసాగాయి. భక్తి కీర్తనలు, ప్రత్యేక పూజలతో కల్యాణ వేదిక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకల్లో 200కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనగా, సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్, ఆయన సతీమణి మంజు కూడా కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోయి గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.