Share News

Donald Trump: అసలు లక్ష్యం చమురే!

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:34 AM

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఆయన నివాసం నుంచే అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి నిర్బంధించి తీసుకుపోవటంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Donald Trump: అసలు లక్ష్యం చమురే!

  • వెనెజువెలాలో 303 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు

న్యూఢిల్లీ, జనవరి 3: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఆయన నివాసం నుంచే అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి నిర్బంధించి తీసుకుపోవటంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మదురో తన దేశంలో డ్రగ్స్‌ కార్టెల్స్‌ను నడుపుతూ.. అమెరికాలోకి అక్రమంగా మత్తుపదార్థాలు రవాణా చేస్తున్నారని ఆ దేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే, అసలు కారణం అది కాదని.. వెనెజువెలాలో ఉన్న విస్తారమైన చమురు, గ్యాస్‌, బంగారం నిల్వలను దక్కించుకొనేందుకే మదురోను గ ద్దె దింపిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనెజువెలా ఒకటి. ఆ దేశంలో 303 బిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉందని అంచనా. సహజవాయువు కూడా అదే స్థాయిలో ఉంది. బంగారం, ఇతర విలువైన ఖనిజాలకు కూడా వెనెజువెలా కేంద్రంగా ఉంది. అయితే, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా వాటిని భారీగా వెలికితీయలేకపోతోంది. వెనెజువెలాలో వామపక్ష నాయకుడైన హ్యూగో చావెజ్‌ 1998 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచి, 1999లో అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమలను జాతీయం చేశారు. అందులో అమెరికా, యూరప్‌ దేశాలకు చెందిన చమురు కంపెనీలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన అమెరికా.. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం ముదురుతూ వచ్చింది. ట్రంప్‌ రెండోసారి అమెరికా అఽధ్యక్షుడు అయ్యాక ఇది మరింత తీవ్రమైంది. మదురోను అధికారం నుంచి దింపేసి తన కీలకబొమ్మలాంటి పాలకులను అక్కడ ఉంచి ఆ దేశంలోని వనరులను దక్కించుకోవాలనేది అమెరికా ప్రణాళిక అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం చేసిన ప్రకటనలు అందుకు ఊతమిచ్చేలాగానే ఉన్నాయి. వెనెజువెలా తదుపరి పాలకుడిని తానే నిర్ణయిస్తానని, అక్కడ న్యాయబద్ధమైన ప్రభుత్వం ఏర్పడేవరకు తామే స్వయంగా వెనెజువెలాను పాలిస్తామని ట్రంప్‌ ప్రకటించగా, ఆ దేశం లాక్కున్న తమ చమురు (కంపెనీల జాతీయం ద్వారా)ను తిరిగి తీసుకుంటామని వాన్స్‌ తెలిపారు. కాగా, వెనెజువెలాపై అమెరికా దాడిని భారత్‌లోని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఖండించాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఎస్‌యూసీఐ(సీ) తదితర పార్టీలు ప్రకటనలు జారీ చేశాయి.

Updated Date - Jan 04 , 2026 | 04:34 AM