Share News

Venezuela Maduro Denies Criminal Charges: నేను అపరాధిని కాను

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:14 AM

వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు మదురో.. అమెరికా తనను నిర్బంధించిన తర్వాత తొలిసారి న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో నోరు విప్పారు.....

Venezuela Maduro Denies Criminal Charges: నేను అపరాధిని కాను

  • ఇంకా వెనెజువెలా అధ్యక్షుడినే

  • మా ఇంటి నుంచి నన్ను బంధించి తీసుకొచ్చారు.. కోర్టులో మదురో వెల్లడి

న్యూయార్క్‌, జనవరి 5: వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు మదురో.. అమెరికా తనను నిర్బంధించిన తర్వాత తొలిసారి న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో నోరు విప్పారు! ‘‘నేను అమాయకుణ్ని. అపరాధిని కాను. చాలా మంచి మనిషిని’’ అని తన కేసును విచారిస్తున్న జడ్జికి చెప్పారు. ‘మీరెవరో చెప్పండి’ అని జడ్జి అల్విన్‌ కె హెల్వర్‌స్టెయిన్‌ (92) అడిగిన ప్రశ్నకు.. ‘‘నేను వెనెజువెలా అధ్యక్షుణ్ని. కారకా్‌సలోని మా ఇంటి నుంచి అమెరికా నన్ను కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చింది’’ అని ఆయన బదులిచ్చారు. మదురో భార్య సిలియా కూడా.. తాను వెనెజువెలా అధ్యక్షుడి భార్యనని, ఆ దేశ ప్రథమ మహిళలనని చెప్పారు. తాను అమాయకురాలినని, అపరాధిని కానని జడ్జికి తెలిపారు. వారిద్దరికీ అమెరికాలో ఉన్న వెనెజువెలా కాన్సులేట్‌తో మాట్లాడే హక్కు ఉందని జడ్జి చెప్పడంతో.. ఆ హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. మదురో తరఫున వాషింగ్టన్‌ డీసీకి చెందిన ప్రముఖ న్యాయవాది బ్యారీ జే పొలాక్‌ వాదనలు వినిపించారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే వంటివారి తరఫున వాదించిన చరిత్ర ఆయనకు ఉంది. ప్రస్తుతానికి మదురో బెయిల్‌ కోరాలని అనుకోవట్లేదని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే, ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలున్నాయని చెప్పారు. ఇక.. అమెరికా నిర్బంధించే సమయంలో సిలియాకు గాయాలయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జడ్జి హెల్లర్‌స్టెయిన్‌ తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేశారు.

కుంటుతూ కోర్టుకు..

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ జైల్లో ఉన్న మదురోను.. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) ఏజెంట్లు సోమవారం ఉదయం హెలికాప్టర్‌లో మన్‌హట్టన్‌ హెలీపోర్టుకు తరలించారు. అక్కణ్నుంచీ పెద్ద సంఖ్యలో మోహరించిన సాయుధ పోలీసుల భద్రత నడుమ.. ఆయన్ను ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఎక్కించి సమీపంలోని ఫెడరల్‌ కోర్ట్‌హౌ్‌సకు తీసుకెళ్లారు. ఖైదీలు ధరించే జంప్‌సూట్‌, కాషాయరంగు బూట్లు వేసుకున్న మదురో.. చేతికి బేడీలతోనే హెలికాప్టర్‌ నుంచి దిగి బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంలో ఎక్కడానికి వెళ్లేటప్పుడు కుంటుతూ నడవడం గమనార్హం.


మాక్కావాల్సింది చేయకపోతే..

మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘(వెనెజువెలాకు) ఏది మంచిదో, అది చేయకపోతే ఆమె భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బహుశా మదురో కన్నా ఎక్కువగా’’ అని ‘ద అట్లాంటిక్‌’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ హెచ్చరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమెరికాకు అనుకూలంగా వ్యవహరించకపోతే మదురోకన్నా దారుణమైన గతి పడుతుందని తేల్చిచెప్పారు! అయితే.. డెల్సీ రోడ్రిగ్స్‌ ఇప్పటికే అమెరికా ముందు మోకరిల్లడం గమనార్హం! వెనెజువెలా పురోగతి కోసం తమతో కలిసి పనిచేయాలంటూ ఆమె అమెరికాకు సోషల్‌ మీడియా సాక్షిగా ఆహ్వానం పంపారు. బయటి ఒత్తిళ్లేవీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని వెనెజువెలా కోరుకుంటున్నట్టు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు.. తమదేశంలో మదురోకు ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు స్విట్జర్లాండ్‌ పభ్రుత్వం ప్రకటించింది.

జడ్జి నేపథ్యమిదీ..

మదురో కేసును విచారిస్తున్న ‘‘యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ద సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’’ జడ్జి అల్విన్‌ కె.హెల్లర్‌స్టెయిన్‌ను.. 1998లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ నియమించారు. ఆయన తన కెరీర్‌లో పలు హైప్రొఫైల్‌ టెర్రరిజం కేసులను, జాతీయభద్రతకు సంబంధించిన కేసులను విచారించారు. 2001లో అమెరికాలోని జంటహర్మ్యాలపై అల్‌కాయిదా జరిపిన దాడులకు సంబంధించిన కేసులను కూడా ఆయన విచారించారు. ట్రంప్‌ హష్‌ మనీ కేసు కేసు విచారణను ఫెడరల్‌ కోర్టుకు మార్చాలన్న ట్రంప్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది ఈ న్యాయమూర్తే.

నోబెల్‌ శాంతి బహుమతే అధ్యక్ష పదవికి అడ్డంకి!

మదురో నిర్బంధం తర్వాత విపక్ష నేత మచాడోకే వెనిజువెలా అధ్యక్ష పీఠం దక్కుతుందని చాలా మంది భావించారు. ఆమె కూడా.. ‘ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛ లభించింది. దేశాన్ని తిరిగి నిర్మిస్తాం’ అంటూ ప్రకటన చేశారు. కానీ.. ఈ ఏడాది శాంతి నోబెల్‌ బహుమతిని ఆమె అంగీకరించడమే ఆమె అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి అడ్డంకిగా మారిందని.. ట్రంప్‌ ఆమెను ఆమోదించడానికి ఇష్టపడలేదని వైట్‌హౌస్‌ వర్గాలను ఉటంకిస్తూ ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఒక కథనంలో పేర్కొంది. ‘‘నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని ఆమె చెప్పి ఉంటే వెనెజువెలా అధ్యక్షురాలై ఉండేది’’ అని ఒక అధికారి పేర్కొన్నట్టు తెలిపింది.

Updated Date - Jan 06 , 2026 | 01:14 AM