Share News

యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో..30 గంటల పాటు మంటలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:07 AM

అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో అంటుకున్న మంటలు 30 గంటల పాటు కొనసాగి....

యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో..30 గంటల పాటు మంటలు

  • లాండ్రీలో మొదలై వెంటిలేషన్‌ పైపుల ద్వారా వ్యాప్తి.. పలు గదులు దగ్ధం

వాషింగ్టన్‌, మార్చి 17: అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో అంటుకున్న మంటలు 30 గంటల పాటు కొనసాగి, గణనీయమైన నష్టం కలగజేశాయి. 600 మంది సిబ్బంది బసచేసే గదులు, వెంటిలేషన్‌ ఏర్పాట్లు, ఇతర పరికరాలు మంటల్లో దగ్ధమయ్యాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా ఈ వివరాలు వెల్లడించింది. నిజానికి నౌకపై ఎలాంటి దాడీ జరగలేదని, లాండ్రీ ప్రాంతంలో సమస్యతో మంటలు చెలరేగాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తొలిరోజున ప్రకటించింది. ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయని పేర్కొంది. నౌక ప్రొపల్షన్‌ వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని, పూర్తిస్థాయిలో పనిచేస్తోందని వెల్లడించింది. అయితే నౌకలో అంటుకున్న మంటలు ఏకంగా 30గంటల పాటు కొనసాగాయని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ప్రధాన లాండ్రీ నుంచి మంటలు డ్రయ్యర్‌లోకి విస్తరించి.. వెంటిలేషన్‌ పైపుల ద్వారా నౌకలోని ఇతర భాగాలకు వ్యాపించాయని పేర్కొంది. 600 మంది సిబ్బంది బస చేసే గదులు, వెంటిలేషన్‌ ఏర్పాట్లు, ఇతర పరికరాలు దగ్ధమైనట్టు వెల్లడించింది. నౌకలోని సిబ్బంది 30 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారని తెలిపింది. వందల మంది సిబ్బంది నౌకలో నేలపై, టేబుళ్లు, ఇతర ప్రాంతాల్లోనే విశ్రమిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఎర్ర సముద్ర ప్రాంతంలో మోహరించి ఉన్న గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ యుద్ధ నౌక ఇరాన్‌పై దాడుల్లో పాల్గొంటోంది. అందులో 4,500 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. కాగా, గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ను అమెరికాకు తరలించి, దాని స్థానంలో మరో యుద్ధ నౌకను మోహరించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 18 , 2026 | 04:07 AM