నౌకా నాశన యుద్ధం
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:43 AM
అమెరికా-ఇరాన్ మధ్య 6 నెలలుగా సాగుతున్న యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై రెండు దేశాలు విచక్షణా రహితంగా ప్రతీకార దాడులు చేస్తున్నాయి.
వాణిజ్య నౌకలపై ఇరాన్, అమెరికా భీకర దాడులు
5 ఇరాన్ చమురు నౌకలను ముంచేసిన అమెరికా
భగ్గుమన్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్
దుబాయ్, సెప్టెంబరు 9: అమెరికా-ఇరాన్ మధ్య 6 నెలలుగా సాగుతున్న యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై రెండు దేశాలు విచక్షణా రహితంగా ప్రతీకార దాడులు చేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకా రవాణా నిబంధనలను సముద్రంలో కలిపేస్తూ.. చమురు, గ్యాస్, కంటైనర్ నౌకలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ ముడి చమురు ధర బుధవారం బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. ఫ్యూచర్ ట్రేడింగ్‌లో బుధవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.77 డాలర్లు పెరిగి 100.69 డాలర్లకు చేరింది. అమెరికాలో డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తూ గ్యాలన్ (3.785 లీటర్లు)కు 5.94 డాలర్లకు చేరింది. మంగళవారం రాత్రి హోర్ముజ్‌లో ఉన్న 5 ఇరాన్ చమురు ట్యాంకర్లను అమెరికా నేవీ ముంచేసింది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న 10 వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ బుధవారం ప్రకటించింది. జోర్డాన్ తూర్పు ప్రాంతంలోని అమెరికా మిలిటరీ బేస్‌పై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. హోర్ముజ్‌లో ఇరాన్ నాటిన సముద్ర మందుపాతరలను గుర్తించేందుకు, నిఘా కోసం అమెరికా వీటిని వినియోగిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన అండురిల్ సంస్థ తయారుచేసిన ఈ అత్యాధునిక సబ్‌మెరైన్ డ్రోన్లు 19 అడుగుల పొడవు ఉంటాయి. స్వయంచాలకంగా పనిచేసే ఈ డ్రోన్ శత్రువు చేతికి చిక్కడంతో అమెరికా మిలిటరీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎన్నికలొస్తున్నాయి.. జాగ్రత్త ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ ట్యునీషియాలోని ఇరాన్ ఎంబసీ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని విడుదల చేసింది. అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ చిత్రాన్ని వాడటంతో అది వెంటనే వైరల్‌గా మారింది. ‘సబ్‌మెరైన్ డ్రోన్‌ను పోగొట్టుకున్నారు. చమురు ధరలు 100డాలర్లు దాటాయి. ఎన్నికలు తరుముకొస్తున్నాయి.. పరిస్థితి ఏంటి ట్రంప్?’ అంటూ ఒక మీమ్‌ను ఇరాన్ ఎంబసీ విడుదల చేసింది. కాగా, ఇరాన్‌పై ఆర్థికంగా మరింత ఒత్తిడి పెంచేందుకు ఆ దేశానికి చెందిన వైమానిక సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. మరోవైపు పాలస్తీనా వివాదం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో బ్రిటన్‌కు వివాదం ముదురుతోంది. తూర్పు జెరూసలేంలో బ్రిటన్ కాన్సులేట్‌ను మూసివేయాలని ఇజ్రాయెల్ బుధవారం ఆదేశించింది. 30 రోజుల్లోగా బ్రిటన్ దౌత్యసిబ్బంది వెళ్లిపోవాలని స్పష్టంచేసింది.
సౌదీ-హుతీ బాహాబాహీ
ఇరాన్-అమెరికా యుద్ధం కొనసాగుతుండగానే పశ్చిమాసియాలో మరో సైనిక ఘర్షణ ముదురుతోంది. యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న తిరుగుబాటుదారులైన హుతీలు సౌదీ అరేబియాపై భీకర దాడులు చేస్తున్నారు. చమురు కేంద్రాలు, పైప్‌లైన్లే లక్ష్యంగా మంగళవారం రాకెట్ దాడులు చేయటంతో పలుచోట్ల భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తమ భూభాగంలో సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు హుతీలు బుధవారం ప్రకటించారు. సౌదీపై దాడులను భారత్ ఖండించింది. ప్రాంతీయ భద్రతకు ఈ దాడులు విఘాతం కలిగిస్తాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేసింది. మరోవైపు సౌదీపై హుతీలు దాడులు ఆపకపోతే మక్కా రక్షణ ఒప్పందం మేరకు తాము రంగంలోకి దిగుతామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.