Share News

ఎటూతేలని చర్చలు!

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:32 AM

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా ప్రారంభమైన అమెరికా, ఇరాన్‌ చర్చలు ఏమీ తేలకుండానే ముగిశాయి. ఇరువర్గాల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉండటం...

ఎటూతేలని చర్చలు!

  • ఇస్లామాబాద్‌లో ఇరాన్‌, అమెరికా భేటీ

  • అమెరికా తరఫున వాన్స్‌, విట్కాఫ్‌, కుష్నర్‌

  • ఇరాన్‌ నుంచి గలీబఫ్‌, అరాగ్చీ హాజరు

  • రెండు గంటలకుపైగా కొనసాగిన చర్చలు

  • ఇరాన్‌ ఆస్తుల ఫ్రీజింగ్‌ ఎత్తివేతకు ఓకే

  • లెబనాన్‌పై దాడుల తీవ్రత తగ్గింపు హామీ

  • హోర్ముజ్‌ జలసంధిపై మాత్రం చిక్కుముడి

  • మరో రోజు చర్చల కోసం పాక్‌ యత్నం

  • ఫలిస్తే నేడూ భేటీలు.. ఆ తర్వాతే ప్రకటన?

  • హోర్ముజ్‌ను శుభ్రపరుస్తున్నాం

  • ఇరాన్‌ తీవ్రంగా నష్టపోబోతోంది: ట్రంప్‌

  • లెబనాన్‌లో మరో 15 మంది మృతి

బీరూట్‌ మినహా మిగతా చోట్ల దాడులు

ఇస్లామాబాద్‌/టెహ్రాన్‌/వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 11: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా ప్రారంభమైన అమెరికా, ఇరాన్‌ చర్చలు ఏమీ తేలకుండానే ముగిశాయి. ఇరువర్గాల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉండటం, ముఖ్యంగా హోర్ముజ్‌ జలసంధి అంశంపై చిక్కుముడి పడటం ఇబ్బందికరంగా మారిందని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కూడా చర్చలు జరిపేలా పాకిస్థాన్‌ ప్రయత్నాలు చేస్తోంది. అది ఫలిస్తే ఆదివారం కూడా ఇరు దేశాల నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. లేకుంటే శనివారం నాటి చర్చల ఆధారంగా ఇరుదేశాల ఉన్నతాధికారులు, నిపుణులు భేటీ అయి.. నివేదిక రూపొందిస్తారు. ఆ తర్వాత ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. 2013లో ఒబామా హయాంలో అమెరికా, ఇరాన్‌ ప్రభుత్వాధినేతల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఆ స్థాయి ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయి.


తొలుత వేర్వేరుగా చర్చలు..

శనివారం తెల్లవారుజామున ఇరాన్‌ బృందం రాగా, అమెరికా బృందం సాయంత్రం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. మధ్యాహ్నం ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ గలీబఫ్‌, విదేశాంగ మంత్రి అరాగ్చీలతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ సమావేశమై చర్చించారు. సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, ట్రంప్‌ అల్లుడు, మాజీ సలహాదారు జేర్‌డ్‌ కుష్నర్‌లతో కూడా పాక్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ భేటీ అయ్యారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇస్లామాబాద్‌లో గట్టి భద్రత ఉండే రెడ్‌ జోన్‌ ప్రాంతంలోని సెరెనా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇరాన్‌ బృందం, అమెరికా బృందం వేర్వేరు గదుల్లో ఉండగా.. పాక్‌ మధ్యవర్తులు వారితో వేర్వేరుగా చర్చలు జరిపి ఇరువర్గాల మధ్య సమాచారం చేరవేశారు. తర్వాత పాక్‌ నేతల సమక్షంలో ఇరాన్‌, అమెరికా ప్రతినిధులు నేరుగా ప్రత్యక్ష చర్చలు ప్రారంభించారు. తొలుత సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. భోజన విరామం అనంతరం తిరిగి మరో గంట పాటు చర్చించారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రత్యక్ష చర్చలు ముగిశాయి. చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన, సానుకూలత వ్యక్తమైన అంశాలు, తర్వాతి దశలో చర్చించాల్సిన ప్రతిపాదనల వివరాలను ఇరుపక్షాలు రాతపూర్వకంగా సిద్ధం చేసి పరస్పరం మార్చుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. చర్చలకు ముందు ఇరాన్‌ పెట్టిన షరతుల్లో ఒకటైన విదేశాల్లోని ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా సిద్ధమైందని తెలిపాయి. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను పూర్తిస్థాయిలో నిలిపివేయడం కాకుండా.. కేవలం హెజ్బొల్లాకు పట్టున్న దక్షిణ ప్రాంతానికే పరిమితం చేయడానికి అంగీకరించినట్టు వెల్లడించాయి. ఈ చర్చల్లో పాకిస్థాన్‌ తరఫున షెహబాజ్‌, మునీర్‌తోపాటు మంత్రులు ఇషాక్‌ దార్‌, మోహ్సిన్‌ నఖ్వీ పాల్గొన్నారు.

ప్రైవేటు హోటల్‌లో చర్చలు ఎందుకు?

శనివారం నాటి చర్చల కోసం అమెరికా, ఇరాన్‌ల నుంచి కీలక నేతలతోపాటు ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, నిపుణులు కూడా వచ్చారు. వారందరికీ బస ఏర్పాట్ల కోసం పాకిస్థాన్‌ సెరెనా హోటల్‌ను ఎంచుకుంది. పార్లమెంటు, ప్రధాని నివాసం, దౌత్యకార్యాలయాలకు సమీపంలో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో 15 ఎకరాల విస్తీర్ణంలోని ఈ హోటల్‌లో 400కుపైగా గదులు ఉన్నాయి. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు ఇక్కడే బస కల్పిస్తుంటారు. అయితే 2008లో దారుణమైన ఉగ్రవాద దాడులు జరిగిన మారియట్‌ హోటల్‌కు సమీపంలోనే ఈ సెరెనా హోటల్‌ ఉండటంతో.. ఇరాన్‌-అమెరికా చర్చలపై ఆందోళన వ్యక్తమైంది. ఇరాన్‌ తరఫున ఆ దేశంలోని కీలక అధికార హోదాలు, కీలక రంగాలకు ప్రతినిధ్యం ఉండే బృందం చర్చలకు రావడం గమనార్హం. పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ గలీబఫ్‌ నేతృత్వంలోని ఈ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, ఉప మంత్రులు కజీమ్‌ ఘరిబాబాదీ, మాజిద్‌ తఖ్త్‌, వలియోల్లా నౌరీ, శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేరీ, పాకిస్థాన్‌లోని ఇరాన్‌ దౌత్యవేత్త రెజా అమీరి మొఘదామ్‌ తదితరులు ఉన్నారు.


మరో రోజు చర్చల కోసం పాక్‌ యత్నం

ఇరాన్‌, అమెరికా నేతల మధ్య శనివారం రాత్రి చర్చలు ముగిశాయి. అయితే ఆదివారం కూడా ఉన్నతస్థాయి చర్చలు కొనసాగించాలని, సానుకూల ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్‌ ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఇరు దేశాల దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, నిపుణులు ఆదివారం సమావేశమై శనివారం నేతల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు తుదిరూపు ఇవ్వనున్నారు.

యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

ఇరాన్‌పై తమ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. యుద్ధ విరమణ కోసం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ చర్చలు జరుగుతున్న సమయంలో ‘ఎక్స్‌’ వేదికగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ఇరాన్‌ ఉగ్రవాద ప్రభుత్వంపై, దాని అనుబంధ గ్రూపులపై ఇజ్రాయెల్‌ సైనిక చర్య ఇంకా ముగియలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 03:32 AM