Share News

అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలం

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:21 AM

ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం....

అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలం

  • ఇస్లామాబాద్‌ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు

  • అణు కార్యక్రమం, హోర్ముజ్‌పై చిక్కుముడి

  • ఎలాంటి ఫలితం లేకుండానే ముగింపు

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/టెహ్రాన్‌, ఏప్రిల్‌ 12: ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్టు తొలుత అంచనాలు వెలువడినా.. ఇరాన్‌ అణు కార్యక్రమం, హోర్ముజ్‌ జలసంధి అంశాలపై చిక్కుముడి పడింది. యుద్ధంతో సాధించలేని అంశాలను అమెరికా కోరుతోందని ఇరాన్‌ మండిపడగా.. ఏమాత్రం సాధ్యంకాని షరతులను ఇరాన్‌ పెట్టిందని అమెరికా స్పష్టం చేసింది. చర్చలు విఫలం కావడంతో కాల్పుల విరమణ కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా పరస్పర దాడులు ప్రారంభం కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు

ఇస్లామాబాద్‌లోని సెరీన్‌ హోటల్‌లో శనివారం సాయంత్రం ప్రారంభమైన చర్చలు రాత్రంతా కొనసాగాయి. ఇరాన్‌ తరఫున పార్లమెంటు స్పీకర్‌ గలీబఫ్‌, విదేశాంగ మంత్రి అరాగ్చీ, అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, ట్రంప్‌ అల్లుడు జేర్‌డ్‌ కుష్నర్‌తోపాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌, ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. తొలిదశ చర్చలు రాత్రి 10 గంటలకు ముగించారు. భోజన విరామం అనంతరం తిరిగి చర్చలు చేపట్టారు. విదేశాల్లోని ఇరాన్‌ ఆస్తుల విడుదల, లెబనాన్‌పై దాడులను పరిమితం చేయడం వంటి పలు అంశాలపై అమెరికా నుంచి సానుకూలత వ్యక్తమైంది. అమెరికా పెట్టిన పలు డిమాండ్లను పరిశీలించేందుకు ఇరాన్‌ సిద్ధమైంది. అయితే ఇరాన్‌ అణు కార్యక్రమం, హోర్ముజ్‌ జలసంధి అంశాల్లో ప్రతిష్ఠంభన నెలకొందని దౌత్యవర్గాలు వెల్లడించాయి.


పాక్‌ను వీడిన ఇరుదేశాల బృందాలు!

చర్చలు ఎటూ తేలకపోవడంతో అమెరికా, ఇరాన్‌ బృందాలు ఆదివారం మధ్యాహ్నమే పాక్‌ను వీడాయి. అయితే ఇరుదేశాల కీలక నేతలు వెళ్లిపోయినా.. దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లోనే ఉండి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ అమెరికా, ఇరాన్‌ బృందాల్లో ఎవరూ కూడా ఇస్లామాబాద్‌లో ఉండిపోలేదని దౌత్యవర్గాలు వెల్లడించాయి. కాగా, దౌత్యపరిష్కారం కోసం ప్రయత్నాలు సాగేందుకు వీలుగా కాల్పుల విరమణను పొడిగించాలని ఒమన్‌ ఆదివారం అమెరికా, ఇజ్రాయెల్‌లకు విజ్ఞప్తి చేసింది.

విశ్వాసం కలిగించడంలో..అమెరికా విఫలమైంది: ఇరాన్‌

ఇరాన్‌ చర్చల బృందంలో విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ గలీబఫ్‌ పేర్కొన్నారు. యుద్ధ ముగింపు విషయంలో తాము సానుకూలంగా ఉన్నామని చర్చలకు ముందే చెప్పామని వివరించారు. చర్చల సందర్భంగా కూడా ఇరాన్‌ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలు అందించిందని తెలిపారు. కానీ గత రెండు యుద్ధాల కారణంగా తమకు అమెరికాపై నమ్మకం పోయిందని, ఇప్పుడు చర్చల్లో కనీస విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా బృందం విఫలమైందని చెప్పారు. కాగా, అమెరికా అర్థంపర్థం లేని డిమాండ్లతోనే చర్చలు విఫలం అయ్యాయంటూ ఇరాన్‌ విదేశాంగ శాఖ అంతకుముందు ప్రకటన విడుదల చేసింది. యుద్ధంతో ఏమాత్రం సాధించలేనివన్నీ అమెరికా ప్రతినిధులు చర్చల్లో ప్రతిపాదించారని.. వాటిని తాము తిరస్కరించామని పేర్కొంది.

దౌత్య ప్రక్రియ కొనసాగించాలి: పాక్‌

కేవలం ఒక్క సెషన్‌ చర్చలతోనే ఒప్పందం కుదురుతుందన్న అంచనాలేమీ లేవని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ పేర్కొన్నారు. ఇరాన్‌, అమెరికా దౌత్య ప్రక్రియను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ విజ్ఞప్తి మేరకు ఇస్లామాబాద్‌లో చర్చల కోసం వచ్చిన ఇరుదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి చర్చలు కొనసాగేందుకు, ఇరువర్గాల మధ్య సంప్రదింపుల కోసం పాకిస్థాన్‌ ప్రయత్నాలు కొనసాగిస్తుందని తెలిపారు.

మా షరతులను ఇరాన్‌ అంగీకరించలేదు: జేడీ వాన్స్‌

చర్చల సందర్భంగా మేం పెట్టిన షరతులను ఇరాన్‌ అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చెప్పారు. అణ్వాయుధాలను తయారు చేయవద్దన్న ప్రాథమిక షరతు ను కూడా తోసిపుచ్చిందన్నారు. చర్చల అనంతరం ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల్లో తాము పూర్తి సానుకూలంగా వ్యవహరించామని పేర్కొన్నారు. అమెరి కా సరైన, అమలు చేయదగిన ప్రతిపాదనలను ముందుపెట్టిందని.. కానీ ఇరాన్‌ వాటికి అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. ఇది అమెరికా కంటే ఇరాన్‌కు చెడు వార్త అని వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రతిపాదనలపై స్పందించేందుకు ఇరాన్‌కు కొంత సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 05:21 AM