Share News

US Withdraws: 66 అంతర్జాతీయ సంస్థలకు అమెరికా దూరం

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:12 AM

అంతర్జాతీయ స్థాయిలో 66 సంస్థలు, ఒప్పందాల నుంచి తప్పుకొంటున్నట్టు అమెరికా ప్రకటించింది. అవి తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటంతోపాటు అమెరికా ప్రజ లు చెల్లించిన పన్నుల సొమ్ము.....

US Withdraws: 66 అంతర్జాతీయ సంస్థలకు అమెరికా దూరం

  • తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తప్పుకొన్న అగ్రరాజ్యం

వాషింగ్టన్‌, జనవరి 8: అంతర్జాతీయ స్థాయిలో 66 సంస్థలు, ఒప్పందాల నుంచి తప్పుకొంటున్నట్టు అమెరికా ప్రకటించింది. అవి తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటంతోపాటు అమెరికా ప్రజ లు చెల్లించిన పన్నుల సొమ్ము వృధా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వాటికోసం ఇన్నాళ్లూ అమెరికా ఖర్చు చేస్తున్న నిధులను, అవే రంగాలకు సంబంధించి ఇతర సమర్థమైన మార్గాల్లో వెచ్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు 66 సంస్థలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగే ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం సంతకం చేశారని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌ ప్రకటించింది. ‘‘అమెరికా నుంచి నిధులు పొందుతూ.. అమెరికా ప్రయోజనాలకు, విధానాలకు విరుద్ధంగా ఉన్న, సరిగా పనిచేయని, ప్రభావం చూపని సంస్థలు, ఒప్పందాల నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు నిర్ణయించారు. దేశ ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్ము వృథా కాకూడదని భావిస్తున్నారు. ఇవే రంగాలకు సంబంధించి ‘అమెరికా ఫస్ట్‌’ విధానానికి మద్దతిచ్చే ఇతర సమర్థమైన మార్గాల్లో ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించారు’’ అని తెలిపింది. అమెరికా తప్పుకొన్న 66 సంస్థల్లో 31 ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోనివికాగా, మిగతా 35 ఇతర సంస్థలు. ఇందు లో భారత్‌-ఫ్రాన్స్‌ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సోలార్‌ అలయన్స్‌ కూడా ఉంది. గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలను తగ్గించి, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిని భారీగా పెంచడం.. ఇందుకోసం సభ్య దేశాలకు సాయం అందించడం ఈ సంస్థ లక్ష్యం. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. 120 దేశాలు దీనిలో సభ్యులుగా ఉండటం గమనార్హం.

Updated Date - Jan 09 , 2026 | 04:12 AM