రంగంలోకి అమెరికా యుద్ధ నౌకలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:11 AM
హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను తొలగించేందుకు అమెరికా రెండు అధునాతన యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. సముద్ర జలాల్లో ...
హోర్ముజ్‌లో సీ మైన్లు తొలగించేందుకు చర్యలు
వాషింగ్టన్, ఏప్రిల్ 12: హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను తొలగించేందుకు అమెరికా రెండు అధునాతన యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. సముద్ర జలాల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ (ఐఆర్‌జీసీ) అమర్చిన సీ మైన్లను పూర్తిగా తొలగించి, ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చేసేందుకు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలైన యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యూఎ్‌సఎస్ మైకేల్ మర్ఫీలను మోహరించింది. హోర్ముజ్ ప్రాంతంలోని జలాల్లో ఐఆర్‌జీసీ అమర్చినట్టు భావిస్తున్న సీ మైన్లను గుర్తించి, తొలగించడమే ఈ మిషన్ లక్ష్యమని, దీనికోసం ఈ రెండు నౌకలు అరేబియా గల్ఫ్‌లోకి ప్రవేశించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
సీ మైన్లను ఎలా తొలగిస్తుందంటే..!
హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లు అమర్చిన ప్రాంతంలోకి ఈ యుద్ధ నౌకలను పంపేందుకు బదులుగా అమెరికా.. తొలుత ఆ నౌకల్లోని ఎంకే-18, ఎంవోడీ-2 కింగ్‌ఫిష్ వంటి మానవరహిత వాటర్ డ్రోన్లను ఉపయోగించనుంది. టార్పెడోల ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు నీటిలో చురుకుగా కదులుతూ సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేస్తాయి. సోనార్ సాయం తో నీటి అడుగున దాచిపెట్టిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. వీటితోపాటు ఎంహెచ్-60ఎస్ వంటి హెలికాప్టర్లను కూడా అమెరికా మోహరించింది. ఇవి ఎయిర్‌బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ (ఏఎల్‌ఎండీసీ)ను ఉపయోగించి.. నీటి ఉపరితలం నుంచి అడుగున వేలాడే మందుపాతరలను వేగంగా గుర్తిస్తాయి. అలాగే.. ఏజిస్ కంబాట్ సిస్టమ్ (ఏసీఎస్), అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణులు ఉండడం వల్ల ఈ రెండు యుద్ధ నౌకల రక్షణ వ్యవస్థ బలంగా ఉంది. ఈ క్షిపణులు ఐఆర్‌జీసీ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా నిర్వీర్యం చేయగలవు.