పశ్చిమాసియాకు 10వేల మంది అమెరికా సైనికులు?
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:32 AM
ఇరాన్‌పై భూతల దాడులకు, కీలక దీవిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో..
దుబాయ్/వాషింగ్టన్, మార్చి 27: ఇరాన్‌పై భూతల దాడులకు, కీలక దీవిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో..ఇరువైపులా సైన్యం సమీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా ఇప్పటికే మూడు మధ్యతరహా యుద్ధనౌకల్లో సుమారు 2,000మంది యాంఫిబియస్ రెడీ గ్రూపు బలగాలు, మరో 2,500 మంది మెరైన్ సిబ్బందిని, 2వేల మంది ఎయిర్‌బార్న్ డివిజన్ సైనికులను పశ్చిమాసియాకు తరలించింది. తాజాగా మరో 10 వేల మందిని పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అమెరికా రక్షణశాఖ వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్, యాక్సియోస్ వార్తాసంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి. ఈసారి అమెరికా పంపుతున్న బలగాల్లో ఇన్‌ఫాంట్రీ యూనిట్లు, సాయుధ వాహనాలు కూడా ఉండనున్నట్టు తెలిపాయి. వాటన్నింటినీ ఇరాన్ తీర ప్రాంతంపై, ఖార్గ్ దీవిపై వెంటనే దాడి చేయగల ప్రాంతంలో మోహరించనున్నట్టు వెల్లడించాయి. అమెరికా భూతల దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ ఏకంగా 10 లక్షల మందితో సిద్ధమైంది. 12ఏళ్లు నిండిన పిల్లలను కూడా ఐఆర్‌జీసీ బలగాల్లోకి చేర్చుకుంటున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధంతో ఇజ్రాయెల్‌కు సైనికుల కొరత తలెత్తింది. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) చీఫ్ జమీర్ ఆ దేశ ప్రభుత్వానికి ఈ విషయం స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు కనీసం 12 వేల మంది సైన్యం అవసరమని పేర్కొన్నారు. లేకుంటే ఇజ్రాయెల్ బలగాల వ్యవస్థ కూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తప్పనిసరిగా మిలిటరీలో చేరి సేవలు అందించాల్సిన గడువును పెంచాలని సూచించారు.