ఇరాన్ చమురుపై ఆంక్షల ఎత్తివేత
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:17 AM
ఇరాన్ చమురు విక్రయాలు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
అమెరికా ఆర్థిక శాఖ ఉత్తర్వులు
ఇరాన్ మా మొక్కజొన్న కొంటే నిధులపైన ఉన్న ఆంక్షలను కూడా తొలగిస్తాం: వాన్స్
హోర్ముజ్ సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
చర్చల్లో అమెరికా-ఇరాన్ అంగీకారం
బర్గెన్‌స్టాక్, జూన్ 22: ఇరాన్ చమురు విక్రయాలు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే ఆగస్టు 21వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్ అమెరికా నుంచి సోయా, మొక్కజొన్నను కొనుగోలు చేస్తే.. విదేశాల్లోని ఇరాన్ నిధులపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మరోవైపు, కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో సమాచారాన్ని నేరుగా ఇచ్చిపుచ్చుకునేందుకు అమెరికా- ఇరాన్ తొలిసారి అంగీకరించాయి. సమాచార లోపం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆది, సోమవారాల్లో జరిగిన ముఖాముఖి చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసున్నట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్ సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)లోని పేరా 5ను అనుసరించి ఈ సమాచారం వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. పేరా 5 ప్రకారం హోర్ముజ్ జలసంధిలో 60 రోజులపాటు వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. లెబనాన్ విషయంలో కూడా చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలను నివారించేందుకు ఒక ‘ఘర్షణ నివారణ సెల్’ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల చర్చలు ఫలవంతమయ్యాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘే సోమవారం తెలిపారు. కాగా, తాను చెప్పినట్లు ఇజ్రాయెల్ వింటుందన్న ట్రంప్ ప్రకటనను ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఖండించారు. స్వతంత్ర దేశంగా తాము తమ ప్రయోజనాలు కాపాడుకొనేందుకే నిర్ణయాలు తీసుకుంటామని, ఇతరుల మాట వినాల్సిన అవసరం లేదని ఆదివారం ఒక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
ఆదివారం హోర్ముజ్‌ను దాటిన 12 నౌకలు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో ఆ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. ఆదివారం 12 మాత్రమే ఆ మార్గంలో ప్రయాణించినట్లు సముద్ర రవాణాపై నిఘా ఉంచే విండ్‌వార్డ్ సంస్థ సోమవారం వెల్లడించింది.కాగా, ఈ నెల 17న హోర్ముజ్ జలసంధిని తెరిచిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించిన నౌకల్లో నాలుగు మనదేశానికి ఎరువులు తీసుకొస్తున్నాయని ఎరువుల శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. హోర్ముజ్‌ను మళ్లీ మూసివేసినప్పటికీ ఇరాన్-అమెరికా మధ్య చర్చల్లో పురోగతి ఉండటంతో ముడిచమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ప్రపంచ బెంచ్‌మార్క్‌గా భావించే బ్రెంట్ ముడిచమురు ధర సోమవారం 0.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 80 డాలర్లకంటే దిగువకు పడిపోయింది.