Share News

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:24 AM

వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల్ని చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో..

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 20: వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల్ని చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ తీర్పు ఉన్నదున్నట్లు అమలవుతుందా? ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించే ట్రంప్‌ ఏమైనా తిరకాసు పెడతారా? అన్న ఆసక్తి నెలకొంది. అమెరికా రాజ్యాంగం ఈ విషయంలో ఏం చెబుతోంది అన్న చర్చ మొదలైంది. మన దేశ రాజ్యాంగంలాగే అమెరికా రాజ్యాంగం కూడా అధికారం ఏ ఒక్క వ్యవస్థలోనూ కేంద్రీకృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. దాని ప్రకారం.. పన్నులు, సుంకాలపై చట్టాలు చేసే అధికారం అమెరికా కాంగ్రె్‌సకు (ఆ దేశ అత్యున్నత చట్టసభకు) మాత్రమే ఉంది. ఆర్టికల్‌-1 ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఆర్టికల్‌-2 అధ్యక్షుడి అధికారాల్ని నిర్వచిస్తుంది. దీని ప్రకారం, కాంగ్రెస్‌ చేసే చట్టాల్ని అధ్యక్షుడు అమలు చేయాలి. ఆర్టికల్‌-3 ప్రకారం చట్టాల్ని సుప్రీంకోర్టు విశదీకరిస్తుంది, న్యాయపరమైన వివాదాల్ని పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో.. ఈ అధికారాల విభజననే ఉటంకిస్తూ.. పన్నులు విధించే అధికారం కాంగ్రె్‌సదేకానీ, అధ్యక్షుడిది కాదని స్పష్టం చేసింది. తద్వారా, ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవ్యతిరేకమని తేల్చింది. చట్టాలకు భాష్యం చెప్పే అధికారం కోర్టులదే కాబట్టి.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పక్కనపెట్టటానికి ట్రంప్‌కు అధికారం లేదు. అంటే, ప్రస్తుతానికైతే, సుంకాలు వెనక్కి తీసుకోక తప్పదనే విశ్లేషకులు అంటున్నారు. అయితే, రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే కొన్ని మార్గాల్లో ఆ తీర్పును అడ్డులేకుండా చేసుకునే అవకాశాలు ట్రంప్‌ ముందున్నాయి. అవేమిటంటే.. 1. అధ్యక్షుడు విధించిన సుంకాల్ని ఆమోదిస్తూ కాంగ్రెస్‌ చట్టం చేయటం 2. తదనంతర కాలంలో సుప్రీంకోర్టే.. ప్రస్తుతం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి కొత్త తీర్పు ఇవ్వటం. కాంగ్రె్‌సలో ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్‌ పార్టీకే మెజారిటీ ఉన్నందున.. చట్టం తీసుకురావటానికి అవకాశాలున్నాయి. అయితే, రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ విధానాలపై పూర్తి సానుకూలత లేదు. కొంత అసమ్మతి ఉంది. కాబట్టి, పార్టీ ఎంపీలందరూ మద్దతిస్తారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 21 , 2026 | 02:24 AM