Venezuelan Soldiers: రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:07 AM
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే క్రమంలో వెనెజువెలా సైనికులను నిలువరించేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన సోనిక్ ఆయుధాన్ని..
మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనెజువెలా సైనికులు.. అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా ?
న్యూఢిల్లీ, జనవరి 11: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే క్రమంలో వెనెజువెలా సైనికులను నిలువరించేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించిందనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బలమైన ధ్వని తరంగాలను ప్రయోగించి ప్రజలను నిస్సహాయ స్థితిలోకి చేర్చేవి లేదా అశక్తులను చేసే ఆయుధాలను సోనిక్ ఆయుధాలు అంటారు. అయితే, అమెరికా దాడి చేసిన సమయంలో మదురోకు అత్యంత సమీపంగా విధుల్లో ఉన్న ఓ గార్డు చెప్పిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమెరికా అత్యాధునిక సోనిక్ ఆయుధాన్ని వాడిందనే చర్చకు బలం చేకూరుస్తున్నాయి. ‘‘ఆ రోజు మేమంతా విధులు నిర్వహిస్తున్నాం. హఠాత్తుగా రేడార్ వ్యవస్థలన్నీ పని చేయడం మానేశాయి. ఆకాశంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లు కనిపించాయి. అవి వెళ్లిన వెంటనే 8హెలికాప్టర్లు వచ్చాయి. వాటిల్లోనుంచి సుమారు 20మంది సైనికులు దిగారు. వాళ్లంతా వేగంగా, కచ్చితత్వంతో కాల్పులు జరిపారు. మేము వందల మంది ఉన్నా వారి ముందు తేలిపోయాం. ఈలోగా వాళ్లు ఏదో ఆయుధాన్ని ప్రయోగించారు. ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ ఒక భయంకరమైన శబ్ధం వచ్చింది. దాని తీవ్రతకు తల పగిలిపోతుందేమో అనిపించింది. ఆ వెంటనే మా ముక్కుల్లో నుంచి నెత్తురు కారింది. కొంతమంది రక్తం కక్కుకున్నారు. అందరం నిస్సహాయ స్థితిలో కింద పడిపోయాం. ఆ 20మంది మాకు చెందిన వందల మందిని చంపేశారు. వాళ్లతో మేము పోరాడలేకపోయాం. సోనిక్ ఆయుధమో లేక అది మరొకటో తెలియదు కానీ ఆ ధ్వని తర్వాత మేము కనీసం నిలబడలేకపోయాం’’ అని గార్డు పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేయగా.. మీరు చేస్తున్న పనిని ఆపి ఇది చదవండి అంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లావిట్ ఆ పోస్టును రీపోస్ట్ చేశారు.