పశ్చిమాసియాకు మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:47 AM
పర్షియన్ గల్ఫ్‌లో మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, 10 వేలమంది నావికులు, నౌకాదళ సైనికులను మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
10 వేలమంది సైనికులు అమెరికా వెల్లడి
వాషింగ్టన్, అక్టోబరు 2 : పర్షియన్ గల్ఫ్‌లో మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, 10 వేలమంది నావికులు, నౌకాదళ సైనికులను మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని దాడులు జరపాలని నిర్ణయిస్తే.. ఈ బలగాలు అందుకు ఉపకరిస్తాయి. ఇప్పటి వరకు సాండియాగో పోర్ట్‌లో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ థియోడర్ రూజ్‌వెల్ట్ ఆదివారం పశ్చిమాసియాకు బయలుదేరింది. ఇది అక్కడ మూడో అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అవుతుంది. గత ఏప్రిల్‌లోనూ పశ్చిమాసియాలో మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించారు. అమెరికాలో నవంబరు మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై భారీ ఎత్తున దాడులు జరిపే అవకాశం ఉందని ఇప్పటికే ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ మోహరింపులు జరుగుతుండడం గమనార్హం. సోమవారం ఒక అసాల్ట్ షిప్, ఎయిర్‌క్రా్‌ఫ్టలతో యూఎ్‌సఎస్ మెకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్‌నకు చెందిన 2,200 మంది మెరైన్లు పశ్చిమాసియాకు బయలుదేరారు. ఇప్పటికే యూఎ్‌సఎస్ బాక్సర్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్ హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు ఖతర్, సౌదీల్లోని ఇంధన, గ్యాస్ సరఫరా వ్యవస్థలను పరిరక్షించేందుకు రెండు క్షిపణి బ్యాటరీలను అమెరికా అక్కడికి పంపింది.