US Seizes Russian Oil Tankers: రష్యా చమురు ట్యాంకర్‌నుస్వాధీనం చేసుకున్న అమెరికా
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:15 AM
వెనెజువెలాపై ఆంక్షలున్నా ఆ దేశ చమురు సరఫరా చేస్తున్నాయంటూ రెండు చమురు రవాణా నౌక (ట్యాంకర్)లను అమెరికా స్వాధీనం చేసుకుంది.
ఐస్‌ల్యాండ్ సమీపంలో పట్టుకున్న అమెరికా కోస్ట్‌గార్డ్.. కరీబియన్ ప్రాంతంలో మరో చమురు ట్యాంకర్ కూడా..
వెనెజువెలాపై ఆంక్షలున్నా చమురు సరఫరా చేస్తున్నందుకేనన్న అమెరికా
వాషింగ్టన్, జనవరి 7: వెనెజువెలాపై ఆంక్షలున్నా ఆ దేశ చమురు సరఫరా చేస్తున్నాయంటూ రెండు చమురు రవాణా నౌక (ట్యాంకర్)లను అమెరికా స్వాధీనం చేసుకుంది. అందులో రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్ ‘మరినెరా’తోపాటు సోఫియా పేరిట ఉన్న మరో ట్యాంకర్‌ను అమెరికా తీరప్రాంత గస్తీ దళం బుధవారం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఐస్‌ల్యాండ్, యూకే మధ్య నుంచి ప్రయాణిస్తున్న ‘మరినెరా’పై అమెరికా కోస్ట్‌గార్డు దళాలు హెలికాప్టర్లలో దిగి స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఖాళీగా ఉన్న ఈ నౌక వెనెజువెలా నుంచి బయలుదేరి రష్యా వైపు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. ఇక సోఫియా ట్యాంకర్ కరీబియన్ ప్రాంతంలో వెనెజువెలా వైపు ప్రయాణిస్తోంది. రష్యాకు చెందిన ఈ నౌక పేరు బెల్లా-1. వెనెజువెలాపై ఆంక్షలు ఉన్నా కూడా ఆ దేశం నుంచి చమురు రవాణా చేస్తోందని, హెజ్బొల్లా ఉగ్రవాద గ్రూపుతో సంబంధమున్న కంపెనీకి కార్గోను అక్రమంగా రవాణా చేస్తోందని పేర్కొంటూ దానిపై అమెరికా నిషేధం విధించింది. నిషేధాన్ని తప్పించుకొనేందుకు ‘మరినెరా’గా పేరు మార్చి చమురు రవాణా కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అమెరికా దళాలు.. ‘మరినెరా’ను స్వాధీనం చేసుకునేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాయి. డిసెంబరులోనే ఒకసారి విఫలయత్నం చేశాయి. తాజాగా మరినెరా నౌకపై నిఘా పెట్టిన అమెరికా కోస్టుగార్డ్.. 15 రోజులుగా అమెరికా పీ-8ఏ పొసైడాన్ ఎయిర్‌క్రా్‌ఫ్టతో నిఘా పెట్టింది. కోస్ట్‌గార్డు షిప్‌లతో వెంటాడుతూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మంగళవారమే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్ కూడా అమెరికా దళాలకు తోడుగా రంగంలోకి దిగాయి. ఈ విషయం తెలిసిన రష్యా మరినెరా నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామిని, కొన్ని నౌకలను పంపింది. అవి సమీపంలోకి చేరుకునే సరికే అమెరికా కోస్టుగార్డు మరినెరాను నియంత్రణలోకి తీసుకున్నాయి.
అమెరికా- రష్యా మధ్య ఉద్రిక్తతలు!
రష్యా పతాకంతో ఉన్న పౌర ట్యాంకర్ నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యా మండిపడింది. అమెరికా తీరానికి 4 వేల కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న పౌర నౌకను నియంత్రణలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. మరినెరా ట్యాంకర్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని, అందులోని రష్యా పౌరుల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించాలని అమెరికాకు స్పష్టం చేసింది. వెనెజువెలాపై ఉన్న ఆంక్షలు, యూఎస్ ఫెడరల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే.. మరినెరాను స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. అయితే మరినెరా స్వాధీనం సమయంలో ఓ వైపు అమెరికా దళాలు, మరోవైపు రష్యా జలాంతర్గామి, నౌకలు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.