Oil Imports: భారత్‌కు వెనెజువెలా చమురు
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:26 AM
రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనడంపై కినుకగా ఉన్న అమెరికా.. దానికి బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనడాన్ని అనుమతించేందుకు సిద్ధంగా ఉంది.
అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా!
మళ్లీ వెనెజువెలా క్రూడాయిల్ మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గే చాన్స్
న్యూఢిల్లీ, జనవరి 9: రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనడంపై కినుకగా ఉన్న అమెరికా.. దానికి బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనడాన్ని అనుమతించేందుకు సిద్ధంగా ఉంది. ‘వెనెజువెలా చమురును కొనేందుకు భారత్‌ను అనుమతిస్తారా?’ అనే ప్రశ్నకు.. ట్రంప్ పాలనాయంత్రాంగంలోని అధికారి ఒకరు సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోని అన్ని దేశాలకూ వెనెజువెలా చమురును అమ్ముతామంటూ యూఎస్ ఇంధన మంత్రి క్రిస్టొఫర్ రైట్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. నిజానికి 2017-2020 నడుమ వెనెజువెలా నుంచి పెద్ద ఎత్తు న చమురును కొనే టాప్-6 దేశాల్లో భారత్ ఒకటి. 2018లో.. మన దేశ చమురు అవసరాల్లో 5 నుంచి 7ు మేర వెనెజువెలా చమురే తీర్చేది. ఇండియాలోని కాంప్లె క్స్ రిఫైనరీలు(హెవీ ఆయిల్‌ను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి) ఆ దేశ హెవీ క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేవి. అప్పట్లో ఇండియా ఆ దేశం నుంచి రోజుకు సగటున 3 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసేది. 2022 తర్వాత అమెరికా ఆంక్షలతో కొనుగోళ్లను భారీగా తగ్గించేసింది. అదే సమయంలో రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు వస్తుండడంతో ఆ దేశం నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించింది. కానీ.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారింది! రష్యా నుంచి చమురు కొనే దేశాలపై ఆయన సుంకాల బాదుడుతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మన ఉత్పత్తులపై 50ు దాకా సుంకాలు విధించారు. ఇంకా మాట వినకపోతే 500ు దాకా సుంకాల భారం మోపుతానని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కావడానికి కూడా ఇదో పెద్ద అడ్డంకిగా మారింది. వెనెజువెలాలో తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది. కాకపోతే, ఆ కొనుగోళ్లు పాత విధానంలో కాక.. అమెరికా నియంత్రిత విధానంలో ఉంటాయి. కాగా.. ప్రస్తు తం వెనెజువెలా వద్ద సిద్ధంగాఉన్న 3కోట్ల నుంచి 5 కోట్ల బ్యారెళ్ల చమురును అమ్మడానికి ప్రణాళికలు రచిస్తున్నామని.. భవిష్యత్తులో కూడా ఆ దేశ ముడిచమురును విక్రయిస్తామని క్రిస్టొఫర్ రైట్ మరో ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఆ దేశంలో గతంలో పనిచేసిన చమురు కంపెనీలతోపాటు, అక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఇన్నాళ్లూ ఆంక్షల కారణంగా అంతగా మార్కెట్లోకి రాని వెనెజువెలా చమురు ఇప్పుడు విపణిలో అందుబాటులోకి వస్తే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బ్యారెల్‌కు డాలర్ చొప్పున ధర తగ్గినా.. మన ఆయిల్ దిగుమతుల బిల్లు ఏడాదికి రూ.13 వేల కోట్ల మేర తగ్గుతుంది. కాబట్టి వెనెజువెలా చమురు విపణిలో అందుబాటులోకి రావడం భారత్‌కు శుభవార్తే.
పాత డివిడెండ్ వసూలయ్యే చాన్స్
వెనెజువెలా చమురు రంగాన్ని అమెరికా తన చేతుల్లోకి తీసుకోవడం భారత్‌కు మరో రకంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అదేంటంటే.. మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు తూర్పు వెనెజువెలాలోని శాన్‌క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో 40ు వాటా ఉంది. దానికి 2014 నాటికి రావాల్సిన 536 మిలియన్ల మేర డివిడెండు ఇప్పటిదాకా రాలేదు. ఆ తర్వాత సంవత్సరాలకు సంబంధించి మరో 500 మిలియన్ డాలర్ల మేర డివిడెండ్‌కూడా రాలేదు. ఇప్పుడా బిలియన్ డాలర్లూ వచ్చే అవకాశం ఉంది.