Share News

హోర్ముజ్‌ జలసంధిలోఇరుక్కుపోయిన అమెరికా

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:42 AM

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అడ్డంగా ఇరుక్కుపోయింది. యుద్ధం మొదలై రెండు వారాలు పూర్తయినా హోర్ముజ్‌ జలసంధిపై అమెరికా పట్టు సాధించలేకపోయింది.

హోర్ముజ్‌ జలసంధిలోఇరుక్కుపోయిన అమెరికా

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి:

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అడ్డంగా ఇరుక్కుపోయింది. యుద్ధం మొదలై రెండు వారాలు పూర్తయినా హోర్ముజ్‌ జలసంధిపై అమెరికా పట్టు సాధించలేకపోయింది. దీంతో అమెరికా మాటలను చిన్నా చితకా దేశాలు కూడా నమ్మటం లేదు. ఆ దేశానికి అత్యంత విశ్వాసపాత్ర మిత్రులైన ఐరోపా దేశాలు కూడా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ మాటలను విశ్వసించటంలేదు. అమెరికా సొంత నౌకలే తమ అధ్యక్షుడిపై నమ్మకం లేక హోర్ముజ్‌ జలసంధిని దాటటానికి సాహసించటంలేదు. ధైర్యంగా జలసంధిని దాటాలని ట్రంప్‌ ఎంతగా పిలుపునిచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇరాన్‌ నౌకలన్నింటినీ నాశనం చేశామని, ఇక ఆ దేశ సైన్యం ఏమీ చేయలేదని ట్రంప్‌ ప్రకటించిన రోజే అమెరికా నౌకాదళంలోని అతిపెద్ద విమాన వాహక నౌక గెరార్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మరోవైపు, కేవలం 500 డాలర్లతో ఉత్పత్తి చేసే సముద్ర మందుపాతరలను హోర్ముజ్‌ జలసంధిలో పేల్చటం ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే 150మిలియన్‌ డాలర్ల ఖరీదైన చమురు ట్యాంకర్లను ఇరాన్‌ సునాయాసంగా పేల్చివేసే స్థితిలో ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇలాంటి కొన్ని వేల మందుపాతరలను హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ పేర్చి ఉంచిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, సముద్రంలో ప్రయాణం మొదలు పెట్టాలంటే ప్రతి నౌకకు బీమా తప్పనిసరి. నౌకలకు సాధారణ బీమాతోపాటు యుద్ధ బీమా కూడా ఉంటుంది. ప్రస్తుతం హోర్ముజ్‌ గుండా వెళ్లే నౌకలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఏ బీమా సంస్థ కూడా ముందుకు రావటం లేదు. ఈ మార్గంలో వెళ్లే నౌకలకు బీమా కల్పించేందుకు ట్రంప్‌ 20 బిలియన్‌ డాలర్లు కేటాయించినా బీమా కంపెనీలు పెద్దగా పట్టించుకోలేదు.

Updated Date - Mar 16 , 2026 | 03:42 AM